Pawan Kalyan: కాకినాడ నుంచి ఎంపీగా పోటీ?

Pawan Kalyan: జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్‌ప్రైజింగ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా కాకుండా కాకినాడ ఎంపీగా పోటీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఎప్ప‌టినుంచో ప‌వ‌న్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు క‌న్ఫామ్ అయిపోయిన నేప‌థ్యంలో పవ‌న్ ఎంపీ స్థానం నుంచి పోటీ కూడా క‌న్ఫామ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అన‌కాప‌ల్లి నుంచి ప‌వన్ క‌ళ్యాణ్ సోద‌రుడు నాగ‌బాబు (Naga Babu) ఎంపీగా పోటీ చేస్తార‌ని అనుకున్నారు.

రెండు స్థానాల‌ను జ‌నసేన‌కే ద‌క్క‌డంతో కాకినాడ నుంచి ప‌వ‌న్ పోటీ చేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. మొన్న రాత్రి ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీతో జ‌రిగిన చ‌ర్చ‌లో భాగంగా ఆ పార్టీ కూడా ఇదే సూచించిన‌ట్లు తెలుస్తోంది. అధికారంలోకి వ‌చ్చాక ఎవ‌రు ఏ ర‌కంగా ఉండాలో కూడా స్థూలంగా చ‌ర్చించారు. అందులో భాగంగానే కాకినాడ నుంచి లోక్ స‌భకు ప‌వ‌న్ పోటీ చేయ‌డం ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ప్ర‌భుత్వంలో కేంద్ర‌మంత్రిగా ప‌వ‌న్‌కు స్థానం ద‌క్కుతుంద‌న్న అంశాన్ని ప్ర‌స్తావించారు. న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా జ‌న‌సేన‌కే కేటాయించిన‌ట్లు తెలుస్తోంది.

జ‌న‌సేన‌కు కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం లోక్‌స‌భ స్థానాలు అనుకోగా.. మ‌చిలీప‌ట్నం స్థానాన్ని విర‌మించుకున్నారు. దాని బ‌దులు న‌ర‌సాపురం నుంచి జ‌న‌సేన పోటీ చేస్తుంది. మచిలీప‌ట్నం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. 8 లోక్ స‌భ స్థానాల‌ను అటు జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీకి కలిపి కేటాయించారు.