TDP BJP Janasena: పొత్తుతో ఏపీ పరిస్థితి ఎలా ఉండ‌బోతోంది?

TDP BJP Janasena: తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు ఒక్క‌ట‌య్యాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో క‌లిసే బ‌రిలోకి దిగ‌నున్నాయి. ఎన్నిక‌ల్లో ఓట్లతో క్లీన్ స్వీప్ చేస్తామ‌ని ఇప్ప‌టికే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ధీమా వ్య‌క్తం చేసారు. అస‌లు ఈ పొత్తుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ఏంటి లాభం? పోనీ న‌ష్టం ఏమ‌న్నా ఉందా? అస‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతోంది.. అనే అంశాల‌ను ఓసారి ప‌రిశీలిస్తే..

2014 ఎన్నిక‌ల్లో NDAతో చేతులు క‌లిపిన చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి పొత్తు నుంచి బ‌య‌టికి వ‌చ్చేసారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీనిని ప‌ట్టుకుని అప్ప‌ట్లో చాలా మాట‌లు అన్నారు. అలాంటిది ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా వెళ్లి మ‌రీ పొత్తు పెట్టుకుందాం స‌ర్‌.. ఏపీలో మేం గెల‌వాలంటే మీ అవ‌సరం మాకెంతో ఉంది అని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంత‌గా బ‌తిమిలాడాల్సిన అవ‌స‌రం చంద్ర‌బాబుకి ఏముంది? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం అంద‌రికీ తెలిసిందే.

ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి రావాల‌నేది చంద్ర‌బాబు నాయుడు కోరిక‌. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని (Jagan Mohan Reddy) ఎలాగైనా గ‌ద్దె దించాల‌నేది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోరిక‌. ఇద్ద‌రి స్ట్రాటెజీలు, ఆలోచ‌నా విధానాలు వేరైనా ల‌క్ష్యం మాత్రం ఒక్క‌టే. ఎలాగైనా YSRCPని దించేయాలి అని. ఈ పొత్తుల‌తో ప్ర‌జ‌ల‌కు ఒరిగింది ఏమీ లేదు. ఎవరైతే త‌మ కులం వారికి ఓట్లు వేసుకోవాల‌నుకుంటారో వారికి వేసేస్తారు. ఆ కులానికి చెందిన వ్య‌క్తి మంచి చేస్తున్నాడా చేయ‌డం లేదా అనేది ఎవ్వ‌రికీ అవ‌స‌రం లేదు. ఆ నేత మా కులం వాడు.. అత‌నికే మా ఓటు అనే ఆలోచనా ధోర‌ణి చాలా మంది ఓటర్ల‌కు ఉంది. (TDP BJP Janasena)

ALSO READ: Janasena: ఇంకాస్త త్యాగం చేయాలంటున్న BJP..!

వీరంతా ఒక కోవ‌కు చెందిన‌వారు అయితే.. ఈసారి వ‌చ్చే నాయ‌కుడు త‌మ బ‌తుకులు బాగు చేయ‌క‌పోడా? త‌మ‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌క‌పోడా? అని ఎదురుచూస్తున్న జ‌నాలు మ‌రో వైపు ఉన్నారు. అధికారంలోకి ఏ పార్టీ వ‌స్తే ఏంటి.. మాకు మంచి చేసేవాడు.. మా బాధ‌ల్ని ప‌ట్టించుకుని అనుగుణంగా ప‌థ‌కాల‌ను తీసుకొచ్చేవారు వ‌స్తే చాలు. ఇలా అనుకునే వ‌ర్గం కూడా ఉంది. రేపో మాపో తెలుగు దేశం, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీలు క‌లిసి ఉమ్మ‌డి మేనిఫెస్టోని కూడా విడుద‌ల చేస్తాయి. ఈ మేనిఫెస్టో పైనే ఓట్లు ప‌డ‌తాయా లేదా అనేది ఆధార‌ప‌డి ఉంటుంది. ఎందుకంటే ఎవ‌రు ఎవరితో పొత్తు పెట్టుకుంటే ప్ర‌జ‌ల‌కేంటి? మీరు మీరు కొట్టుకుని చావండి మ‌మ్మ‌ల్ని మాత్రం ఎంట‌ర్‌టైన్ చేయండి అన్న‌ట్లు.. మీరు మీరు ఎవ‌రితోనైనా క‌ల‌వండి.. మా ఏపీకి బాగు చేయండి.. మాకు మంచి చేయండి అనే ప్ర‌జ‌లు అనుకుంటారు.

ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయి కాబ‌ట్టి పొత్తు పెట్టుకున్న‌వారు ఒక‌రంటే ఒక‌రి ప‌ట్ల గౌర‌వం ఉన్నా లేక‌పోయినా ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కు మౌనంగా ఉండాలి. మేనిఫెస్టో ఇచ్చిన హామీలు న‌చ్చినా న‌చ్చ‌కపోయినా స‌పోర్ట్ చేసి తీరాలి. లేదంటే మొద‌టికే మోసం వ‌స్తుంది. తీరా ఎన్నిక‌ల్లో ఈ త్రికూట‌మి గెలిచింద‌నుకోండి.. ఆ త‌ర్వాత హామీల అంశంలో విభేదాలు వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.

ఫ‌లానా హామీని నెర‌వేర్చాక… ఆ హామీ మేం ఇచ్చిందే అని జ‌న‌సేన, తెలుగు దేశం, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌కి చెందిన ఏ ఒక్క నేత అయినా బ‌య‌టికి వ‌చ్చి చెప్తే.. మిగ‌తా రెండు పార్టీల నేత‌ల‌కు ఒళ్లు మండుతుంది. పోనీ.. ఇచ్చిన హామీల్లో ఏద‌న్నా నెర‌వేర్చ‌లేదు అనుకోండి.. అప్పుడు త్రికూట‌మిలోని ఏ పార్టీ నేత అయినా వ‌చ్చి అది ఫ‌లానా పార్టీ స‌జెస్ట్ చేసింది.. దానిని అమ‌లు చేయ‌లేక‌పోతున్నారు అని అంటే ఇక ర‌చ్చ మొద‌ల‌వుతుంది. కాబ‌ట్టి ఇలాంటివ‌న్నీ ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. మొత్తానికైతే ఈ త్రికూట‌మి వ‌ల్ల ఏపీ రాజ‌కీయాల్లో పెను మార్పులు వ‌స్తాయ‌నే రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా చెప్తున్నారు.