Malla Reddy: దొరికిపోయాక దూరిపోవ‌డ‌మే..!

Malla Reddy: భార‌త రాష్ట్ర స‌మితి (BRS) నేత మ‌ల్లా రెడ్డి త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇది భార‌త రాష్ట్ర స‌మితికి షాకింగ్.. కాంగ్రెస్ (Congress) పార్టీకి స‌ర్‌ప్రైజింగ్ అంశం అనే చెప్పాలి. మ‌ల్లా రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి రెండు కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి.. గ‌తేడాది తెలంగాణ ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి ఘోర ఓట‌మి పాలైంది. ఇప్పుడు ఫోక‌స్ అంతా లోక్ స‌భ ఎన్నిక‌ల‌పైనే ఉంది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. త‌మ పార్టీ ఎంపీల‌ను, ఎమ్మెల్యేల‌ను అట్టిపెట్టుకోవాల‌ని ఎంతో కృషి చేస్తున్నారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓట‌మి శాతం చాలా త‌క్కువ అని.. ఈ మాత్రం దానికే నిరుత్సాహ ప‌డిపోవ‌ద్ద‌ని చెప్తున్నారు. అయినా కూడా కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు మెల్లిగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల‌ని చూస్తున్నారు.

ఇక మ‌ల్లా రెడ్డి కాంగ్రెస్‌లో చేరాల‌ని అనుకోవ‌డానికి రెండో కార‌ణం ఏంటంటే… ఆయ‌న అల్లుడు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాలేజీల‌కు చెందిన కొన్ని భ‌వ‌నాల‌ను అక్ర‌మంగా నిర్మించార‌ని కూల్చి వేసారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి భార‌త రాష్ట్ర స‌మితి నేత‌ల‌కు చెందిన ఒక్కో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను బ‌య‌ట‌పెడితే వారిని రాజ‌కీయంగా ఎదుర్కోవ‌డం క‌ష్టం అయిపోతుంది. అందుకే మెల్లిగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే ఏ లొల్లీ ఉండ‌ద‌ని మ‌ల్లారెడ్డితో పాటు పలువురు భార‌త రాష్ట్ర స‌మితి నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. (Malla Reddy)