ఉప్పుతో ముప్పు.. WHO ఏం చెబుతోందంటే..
మనం రోజూ తినే ఆహారంలో ఉండే షడ్రుచుల్లో ఒకటి ఉప్పు. ఏ ఇంట్లో అయినా ఉప్పు లేనిదే వంట పూర్తవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఇది మన శరీరానికి అవసరం కూడా. మనం తినే ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి పోషకాలను అందిస్తుంది. అందుకే ఉప్పు తక్కువ తినమని చెబుతారేగానీ మానేయ్యమని చెప్పరు నిపుణులు. అయితే ఎంత మోతాదులో తినాలి అనేది మాత్రం తప్పకుండా తెలుసుకోవలసిన విషయం. ఎందుకంటే ఉప్పు అధికంగా తినడం వల్ల రక్తపోటు సమస్య ఎదురవుతుంది. ఉప్పు మోతాదు విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)చేస్తున్న సూచనలు ఏంటో తెలుసుకుందాం..
* రోజూవారి ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది.
* 2025 నాటికి ఆహారం ద్వారా తీసుకునే సోడియం మోతాదును 30 శాతానికి తగ్గించాలన్న లక్ష్యానికి ప్రపంచ దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉంది.
* ఉప్పులో అధిక శాతం సోడియం ఉంటుంది. అజినమోటోలోనూ సోడియం ఉంటుంది. అందువల్ల వంట చేసేటప్పుడు కాకుండా ఆహారంలో పై నుంచి ఉప్పు వేసుకుని తినే అలవాటు మానుకోవాలి.
* డబ్ల్యూహెచ్ఓ సభ్యదేశాలలో 5 శాతం మాత్రమే సోడియం తగ్గింపు దిశగా సమగ్రమైన, తప్పనిసరి విధానాలను అనుసరిస్తున్నాయి. 73 శాతం సభ్య దేశాలు ఉప్పు తగ్గించే విధానాలను సమగ్రంగా అమలుచేయట్లేదని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది.
* ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 4 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. కానీ ప్రజలు ప్రస్తుతం రోజుకు సగటున 10.8 గ్రాముల ఉప్పును వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల్లో వెల్లడైంది. భారతదేశంలో అయితే 9.8 గ్రాములు. ఇది మన రోజువారీ అవసరాల కంటే 2 రెట్లు ఎక్కువ. పిల్లలకు ఇచ్చే రోజువారీ ఆహారంలో 2 గ్రాముల ఉప్పును చేర్చవచ్చు. సగటు వ్యక్తికి 4 గ్రాముల ఉప్పు అవసరం. రక్తపోటు ఉన్నవారు వారు 3 గ్రాముల ఉప్పు తీసుకుంటే చాలు.
* వయసు బట్టి, అనారోగ్యం ఉంటే దాని స్వభావాన్ని బట్టి ఉప్పు తీసుకోవాలి. మనం తినే కూరగాయలు, ఆకుకూరలు వంటి ప్రతి ఆహారపదార్థంలోనూ కంటికి కనిపించని విధంగా సోడియం ఉంటుంది. కావున వంట చేసేటప్పుడు కాస్త తగ్గించి వాడటం మంచిది.
* ఉప్పు ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, పక్షవాతం, కడుపులో క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు, ఎముకలు పటుత్వం కోల్పోవడం, ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అకాల మరణాలు కూడా సంభవించవచ్చు.
* ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అల్లం, వెల్లుల్లి, ఉల్లి, దాల్చిన చెక్క, నిమ్మకాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి ఆహారంలో ఉప్పు అవసరాన్ని తగ్గించగలవు. ఊరగాయలు, పొడులు, సాల్టెడ్ వేరుశెనగలు, మోనోసోడియం గ్లుటామేట్ ఉన్న పదార్థాలు, జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారా పదార్థాలను తినడం మానేయాలి.