Soumya shetty: దొంగగా మారిన హీరోయిన్.. ఏం జరిగింది?
Soumya shetty: సోషల్ మీడియాను కరెక్ట్‌గా వాడుకుంటే ఎవ్వరికీ అందనంత ఆకాశానికి ఎదగచ్చు. అదే విధంగా అథఃపాతాళానికి పడిపోవచ్చు. రెండూ కూడా కరెక్ట్‌గా జరుగుతాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సౌమ్య శెట్టి విషయంలో ఇదే జరిగింది. సౌమ్య శెట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకుంటూ షార్ట్ ఫిలిం నటిగా.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పాపులారిటీ పెంచుకున్నారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో బాగానే పాపులారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఈమె జైలులో ఊచలు లెక్క పెడుతోంది. ఎందుకంటే.. ఉదయం పూట రీల్స్ చేసుకుంటూ రాత్రి పూట దొంగతనాలకు పాల్పడుతోంది ఈ సౌమ్య శెట్టి. (Soumya Shetty)
ఏం జరిగింది?
సౌమ్య శెట్టికి రిటైర్డ్ పోస్టల్ అధికారి కూతురితో మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ ఎనిమిదేళ్లుగా మంచి స్నేహితులు. దాంతో ఆ అమ్మాయికి సౌమ్యపై నమ్మకం పెరిగింది. సౌమ్యకు షార్ట్ ఫిలింస్ తీసే అలవాటు ఉండడంతో ఆ పోస్టల్ అధికారి కూతురితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కారణంగానే తరచూ సౌమ్య పోస్టల్ అధికారి ఇంటికి వెళ్తూ ఉండేది. ఈ నేపథ్యంలో వీలు దొరికినప్పుడల్లా వాళ్ల ఇంట్లో ఉన్న బంగారాన్ని దోచేస్తూ వచ్చింది. అలా ఇప్పటివరకు విడతల వారీగా దొంగతనం చేస్తూ వచ్చింది. జనవరిలో కూడా సౌమ్య వాళ్లింటికి వెళ్లి దొరికినంత బంగారం దొంగతనం చేసింది. దానిని అమ్మగా వచ్చిన డబ్బుతో గోవాకి వెళ్లి ఎంజాయ్ చేసింది. ఇలా మొత్తం నాలుగు విడతలుగా దాదాపు 100 గ్రాముల వరకు బంగారాన్ని కాజేసింది.
బాత్రూం వాడుకుంటానని చెప్పి..
సౌమ్య ఎప్పుడు పోస్టల్ అధికారి కూతురి ఇంటికి వెళ్లినా.. బాత్రూమ్ వాడుకుంటానని గది తలుపు మూసుకునేది. ఆ సమయంలోనే చోరీకి పాల్పడేది. దాంతో ఇంట్లో వారికి కూడా అనుమానం రాలేదు. కొద్ది కొద్దిగా ఇంట్లోని బంగారం తగ్గుతూ రావడం.. ఇంటికి సౌమ్య తప్ప ఎవ్వరూ పెద్దగా రాకపోవడంతో అనుమానం ఆమెపైనే కలిగింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి సౌమ్యను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెకు 15 రోజుల పాటు రిమాండ్ విధించింది.