Gautam Gambhir: రాజ‌కీయాల నుంచి నాకు విముక్తి క‌లిగించండి

Gautam Gambhir: టీమిండియా మాజీ ఓపెనర్‌, BJP ఎంపీ గౌతం గంభీర్‌ కీలక ప్రకటన చేశాడు. తాను రాజకీయ విధుల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఈ మేరకు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాకు ఎక్స్‌ వేదికగా గంభీర్‌ విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గంభీర్‌ వెల్లడించాడు. (Gautam Gambhir)

“””దయచేసి రాజకీయ విధుల నుంచి నాకు విముక్తి కల్పించగలరని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి నాదొక విన్నవించాను. తద్వారా నా ప్రణాళికలకు అనుగుణంగా నేను పూర్తి స్థాయిలో క్రికెట్‌పై దృష్టి సారించే వీలు కలుగుతుంది. ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్‌“”” అని గౌతం గంభీర్‌ ట్వీట్‌(ఎక్స్‌) చేశాడు. కాగా గంభీర్‌ తూర్పు ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

గౌతమ్ గంభీర్ తాను ఇకపై తన క్రికెట్ కమిట్‌మెంట్‌లపై దృష్టి పెడతానని అంటున్నారు. ఈ నేపధ్యంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌ను బీజేపీ.. ఢిల్లీలోని ఒక స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయమని కోరనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఆయనతో కొందరు పార్టీ నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ALSO READ: Payal Ghosh: గంభీర్ నా వెంట ప‌డ్డాడు కానీ నేను ఇర్ఫాన్ ప‌ఠాన్‌ను ప్రేమించా

అక్షయ్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్షయ్‌ కెరీర్ గ్రాఫ్ పడిపోతోంది. అతని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా ఢిల్లీకి చెందిన గౌతం గంభీర్‌ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే విధ్వంసకర ఓపెనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 147 వన్డేలు, 58 టెస్టులు, 37 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 5238, 4154, 932 పరుగులు సాధించాడు గంభీర్‌. 2016లో భారత్‌ తరఫున ఆఖరి మ్యాచ్‌ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌.. 2019లో రాజకీయాల్లో ప్రవేశించాడు. అప్పటి కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో బీజేపీలో చేరాడు. 2019 సాధారణ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి 695109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు గంభీర్‌.

ఇక అప్పటి నుంచి బీజేపీ తరఫున బలంగా గొంతు వినిపిస్తున్న గంభీర్‌.. క్రికెట్‌ కామెంటేటర్‌గా, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలా మెంటార్‌గానూ సేవలు అందిస్తున్నాడు. గత సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్‌.. తాజా ఎడిషన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గూటికి చేరుకున్నాడు. గతంలో తాను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపిన కేకేఆర్‌కు ఈసారి మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇక కేకేఆర్‌ సహ యజమానులు బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, జూహీ చావ్లా అన్న విషయం తెలిసిందే. అయితే, గంభీర్‌ హఠాత్తుగా రాజకీయాల నుంచి.. ముఖ్యంగా బీజేపీ నుంచి దూరంగా జరగటానికి కారణాలు ఏమిటన్న అంశంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.