జగన్ హెలిప్యాడ్ కోసం రూ. 1.89 కోట్లు ఖర్చు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉండే నివాసం వద్ద ఉన్న హెలిప్యాడ్ నిర్మాణం కోసం రూ. 1.89 కోట్లు మంజూరు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇందులో పెట్టిన ఖర్చులపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి.
హెలిప్యాడ్ అదేవిధంగా దానికి చుట్టూ ఫెన్సింగ్ కోసం రూ.40 లక్షలు, హెలిపాడ్ వద్ద గార్డ్ రూమ్ , ఇతర సదుపాయాల కోసం రూ. 13.50 లక్షలు, సీఎం నివాసం వద్ద పర్మినెంట్ ఇనుప చట్రాలతో బారికేడింగ్ కోసం రూ. 75 లక్షలు, సీఎం ఇంటి సమీపంలోనే పోలీస్ బ్యారెక్, సదుపాయాలకోసం రూ. 30 లక్షలు, సెక్యూరిటీ పోస్ట్, సెక్యూరిటీ గేట్స్, పోర్టబుల్ క్యాబిన్ల కోసం రూ. 31 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే గతంలో ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నాని చెప్పుకొస్తున్న సీఎం జగన్.. ఆయనకు అయ్యే ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే తాడేపల్లి నివాస గృహం, క్యాంపు ఆఫీసుకు కొత్తగా కిటికీలు, తలుపులు అమర్చేందుకు రూ.73 లక్షలు మంజూరు చేస్తూ రోడ్లు భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఖర్చు పెట్టే డబ్బులు అంతా.. భద్రతా కారణాల దృష్ట్యా పెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.