చందమామ పక్కనే ఓ చక్కని చుక్క.. మిస్టరీ అదేనంట!

సౌర వ్యవస్థలో ఏం జరిగినా అది ఓ ఆసక్తికరమైన అంశంగా మారిపోతుంది. విశ్వం అంత అందమైనది మరి. ఇటీవల చంద్రుడి పక్కన ఓ చక్కని చుక్క వచ్చి చేరింది. దీని గురించి చాలా మంది ఆరా తీశారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది కూడా.. ఇక అసలు ఈ చుక్క వెనుక ఉన్న కథ ఏంటా అని నాసా ఆరా తీసి వివరాలు రాబట్టింది. చంద్రుడి పక్కనే చుక్కలా కనిపించినది శుక్ర గ్రహం అని చెబుతోంది. సౌర వ్యవస్థలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు అని.. ఆ గ్రహం చంద్రుడికి పక్కగా రావడంతో ప్రకాశవంతంగా కనిపించి ఉండవచ్చని నాసా ప్రకటించింది.

గ్రహ సంయోగం వల్లే ఇదంతా..
ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. దీనిపై అమెరికా స్పేస్ ఏజెన్సీ సంస్థ నాసా స్పందించింది. చంద్రుడికి శుక్రుడు క్రమక్రమంగా దగ్గరగా జరుగుతూ చంద్రుని వెనుక ఉన్నట్టు కనిపిస్తోంది. నిజానికి ఆ గ్రహాల మధ్య కొన్ని వేల కిలో మీటర్ల దూరంగా ఉన్నప్పటికీ ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైందని పేర్కొంది. దీనిని గ్రహ సంయోగం అని అంటారని చెబుతోంది. సౌర వ్యవస్థలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహమైన శుక్రుడు అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా. తనపై పడే సూర్యకాంతిని శుక్రుడు 70 శాతం వరకు ప్రతిబింబిస్తాడు. భూమి నుంచి చిన్నగానే అయినా స్పష్టంగా శుక్రగ్రహం కనిపిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నెల వరకు చంద్రుడు, శుక్రగహం ఆకాశంలో కలిసి కనువిందు చేస్తాయని నాసా పేర్కొంది.