TDP vs YCP: అనపర్తిలో హై టెన్షన్ ..నువ్వా ..నేనా..!
TDP vs YCP: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న సమయంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో హై టెన్షన్ నెలకొంది. నేను బహిరంగ చర్చకు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు చర్చకు వస్తానని ఆయన YSRCP ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి (Surya Narayana Reddy) సవాల్ విసిరారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్‌పై సూర్యనారాయణ రెడ్డి స్పందించారు.
ఈ నేపథ్యంలో తన హాస్పిటల్ వద్దకు రావాలని సూర్యనారాయణ రెడ్డి YSRCP కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డిల సవాళ్లు, ప్రతి సవాళ్లతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్దకు పోలీసులు భారీగా మోహరించారు. ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సూర్యనారాయణ రెడ్డి పాల్పడిన అవినీతి గురించి ఓ లేఖను రాస్తూ రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే ఆఫీస్‌కి వెళ్లి మరీ సిబ్బందికి అందజేసారు. దమ్ముంటే అవినీతిపై చర్చకు రావాలంటూ రామకృష్ణారెడ్డి.. సూర్యనారాయణ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి తన ఇంటి వద్దకు రావాలని అనగా.. లేదు తన హాస్పిటల్ వద్దకు వస్తే అప్పుడు తేల్చుకుందామని సూర్యనారాయణ రెడ్డి అన్నారు. (TDP vs YCP)
తాను ఉన్నప్పుడు తనకు ముందుగా చెప్పి ఇంటికి వస్తే శరీరంలో ఏ పార్టకు ఆ పార్టు తీసేస్తానంటూ సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరారు. దీనిని రామకృష్ణారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు ఇద్దరు నేతలు సిద్ధం అవుతుండడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి ఈరోజు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై రామకృష్ణారెడ్డి కరపత్రం రూపొందించారు. 9 అంశాలతో కూడిన కరపత్రాన్ని రూపొందించి.. సూర్యనారాయణ రెడ్డి హాస్పిటల్ వద్దకు వెళ్లి మరీ అక్కడ కరపత్రాన్ని అందజేసారు. బహిరంగ చర్చకు రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద తెలుగు దేశం పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “”” ఇక్కడ సవాళ్లు ప్రతిసవాళ్లు లేవు. సవాలు మాత్రమే ఉంది. ప్రతి సవాలు లేదు. నేను సవాల్ చేసాను. ఇంతవరకు సూర్యనారాయణ రెడ్డి నుంచి స్పందన లేదు. ఇవాళ ఇళ్ల పట్టాల పేరుతో ఉపాధి హామీ పథకం తరలిస్తున్నారో.. జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు తరలిస్తున్నారో ఆ విధంగా తరలిస్తున్నారు. పక్క నియోజకవర్గాల నుంచి బ్లేడ్ బ్యాచ్‌లను తీసుకొస్తున్నారు. దళిత సంఘాలను తీసుకొస్తున్నారు. వీళ్లంతా ఎందుకు? నేరుగా నేనొస్తా. చర్చ చేస్తా. అంశాలవారీగా రుజువులతో సహా చూపిస్తా. కోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి. చూపిస్తే దానికి సిద్ధమా? హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లు, తహసీల్దారు రాసిన కాగితాలు ఇలా అన్నీ ఉన్నాయి. దీనిపై సమాధానం చెప్పడానికి సూర్యనారాయణ రెడ్డి సిద్ధంగా ఉన్నారా? బహిరంగ చర్చకు రాకుండా పోలీసులను అడ్డుపెట్టుకుని బ్లేడ్ బ్యాచ్‌లను అడ్డుపెట్టుకోవడం ఎందుకు? దళిత సంఘాలు, ఉపాధి హామీ కూలీలు అమాయకులు. వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్న ఆశతో వారు సహకరిస్తున్నారు “””” అన్నారు.