Dolly Chaiwala: బిల్ గేట్స్‌నే మెప్పించిన ఎవరీ చాయ్‌వాలా?
Dolly Chaiwala: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) తాజాగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్‌ని సందర్శించారు. సుమారు పాతికేళ్ల క్రితం అనగా 1998లో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఐడీసీ కేంద్రం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో పాల్గొనేందుకు బిల్‌గేట్స్ ఇండియా వచ్చారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ఏఐ పవర్డ్ ఇండియాపై మరోసారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పర్యటన సందర్భంగా బిల్‌గేట్స్ ఐడీసీతో పాటు భువనేశ్వర్ ప్రాంతాల్లో పర్యటించారు. ఇండియా పర్యటన సందర్భంగా బిల్‌గేట్స్ ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. డాలీ చాయ్‌వాలా దుకాణాన్ని సందర్శించారు బిల్‌గేట్స్. అతడి చేత టీ పెట్టించుకుని తాగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (Dolly Chaiwala)
ఇండియా పర్యటన సందర్భంగా బిల్‌గేట్స్ దేశంలోని అనేక మంది సామాన్యులను కలుస్తూ.. వారితో విభిన్న అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో బిల్‌గేట్స్ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిలో బిల్ గేట్స్.. సోషల్ మీడియా సెలబ్రిటీ డాలీ చాయ్‌వాలా తయారు చేసిన టీని ఆస్వాదించారు. బిల్ గేట్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఏక్ చాయ్ ప్లీజ్ అనే డైలాగ్‌తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత డాలీ చాయ్‌వాలా.. తనదైన స్టైల్లో అల్లం, ఇలాచీ వేసి చిక్కని టీ తయారు చేసి బిల్‌గేట్స్‌కు అందించారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘‘ఇండియాలో ఒక కప్పు టీ తయారీలో కూడా మీరు కొత్తదనాన్ని కనుగోనవచ్చు.. ఇండియాకు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశం నమ్మశక్యం కానీ ఆవిష్కర్తలకు నిలయం. ఇక్కడి వారు తమ జీవితాలను రక్షించడానికి, మెరుగుపర్చడానికి కప్పు టీని తయారు చేయడంపై కూడా కొత్త మార్గాలని అన్వేషిస్తుంటారు’’ అనే క్యాప్షన్‌తో బిల్‌గేట్స్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక బిల్‌గేట్స్ లాంటి వ్యక్తి.. ఓ సామాన్య చాయ్ దుకాణాదారుడి షాప్ వద్దకు రావడం నిజంగా నమ్మశక్యం గాని విషయం.. ఇది బిల్‌గేట్స్ సింప్లిసిటీ అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.
ఎవరీ డాలీ చాయ్‌వాలా..
డాలీ చాయ్‌వాలా విషయానికి వస్తే.. సామాన్యులకు ఇతడి గురించి తెలియకపోవచ్చు.. కానీ సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి ఇతడు బాగా పరిచయం. స్టైలిష్ చాయ్‌వాలాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అతడు చాయ్ చేసే విధానం, సర్వ్ చేసే పద్దతి కాస్త భిన్నంగా ఉండి కస్టమర్లను ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ హెయిల్ స్టైల్, డ్రెస్సింగ్‌తో మాత్రమే కాక చాయ్ తయారీ, సర్వ్ చేసే విధానంలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు డాలీ.
రోడ్డు పక్కన చిన్న టీస్టాల్ నడుపుకునే ఈ వ్యక్తి.. తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని క్రియేట్ చేసుకుని.. అనతి కాలంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు టీ చేసే పద్దతి, సర్వ్ చేసే విధానం ఇలా ప్రతి దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి సెలబ్రిటీగా మారాడు డాలీ చాయ్‌వాలా. ఇక తాజాగా బిల్‌గేట్స్ ఇతడి చాయ్ దుకాణాన్ని సందర్శించడం మాత్రమే కాక అందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇతడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.