Biden vs Netanyahu: పెద్ద‌న్న‌ల మ‌ధ్య ముదురుతున్న విభేదాలు..!

Biden vs Netanyahu: హమాస్‌తో యుద్ధానికి ముగింపు పలికే విషయంలో ఇజ్రాయెల్‌ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న సూచనలను సైతం ఇజ్రాయెల్‌ మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. గాజాలో హమాస్‌పై యుద్ధం నిలిపివేసే విషయంలో ఇజ్రాయెల్‌, అమెరికా మధ్య విభేదాలు రోజురోజుకీ ముదురుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్‌ పిలుపునిస్తుండగా.. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం అందుకు నిరాకరిస్తూ వస్తున్నారు. తాము చేస్తున్న పోరాటానికి అమెరికా ప్రజల మద్దతు సైతం ఉందని, హార్వర్డ్‌-హారిస్‌ పోల్‌లో దాదాపు 82 శాతం మంది అమెరికావాసులు తమకు మద్దతుగా పలికినట్లు పేర్కొన్నారు.

హమాస్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటీ నుంచి దాన్ని ముగించాలని అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తోందని బెంజమిన్‌ తెలిపారు. తాను సమర్థంగా తిప్పికొడుతూ వస్తున్నానని వివరించారు. ఇప్పటి వరకైతే గాజాలో విజయవంతంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన హార్వర్డ్‌-హారిస్‌ పోల్‌లో దాదాపు 82 శాతం మంది అమెరికావాసులు తమకు మద్దతుగా నిలిచినట్లు తేలిందన్నారు. పూర్తి విజయం సాధించడానికి ఇది స్ఫూర్తి నింపుతుందన్నారు. వచ్చే సోమవారానికి ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని బైడెన్‌ సోమవారం ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ పోరును మరింత ఉద్ధృతం చేస్తే ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభించకపోవచ్చునని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం దిశగా గణనీయ పురోగతి సాధించినట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. బైడెన్‌ సహా ఆయన బృందం వివిధ వర్గాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. అయితే, అధ్యక్షుడు చెప్పినట్లుగా ఇప్పటి వరకైతే తుది ఒప్పందం ఖరారు కాలేదన్నారు. ఇంకా చాలా విషయాలు ఓ కొలిక్కి రావాల్సి ఉందని చెప్పారు. ఒక వేళ సంధి కుదిరితే అది ఆరు వారాల పాటు కొనసాగవచ్చన్నారు. ఆ సమయంలో వివాద శాశ్వత పరిష్కారానికి అడుగులు పడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతానికి ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి విరామం పడనుంది. రంజాన్‌ నెలలో కాల్పుల విరమణకు ఈజిప్టు, ఖతార్‌ దేశాలు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్‌ ఓ అడుగు ముందుకు వేసింది. 40 రోజుల పాటు అన్నిరకాల సైనిక కార్యకలాపాలకు విరామమివ్వాలనే పారిస్‌ చర్చల ప్రతిపాదనలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్‌ అధికారి ఒకరిని ఉటంకిస్తూ రాయిటర్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు.. 1:10 నిష్పత్తిలో హమాస్‌ చెరలో ఉన్న బందీలు, పాలస్తీనా ఖైదీల మార్పిడికి ఇజ్రాయెల్‌ అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. అయితే.. హమాస్‌ నుంచి దీనిపై ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఒకట్రెండ్రోజుల్లో హమాస్‌ నాయకత్వం ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే.. రంజాన్‌(మార్చి 11 నుంచి) మాసమంతా గాజాలో శాంతి నెలకొంటుందని ఈజిప్టు, ఖతార్‌ భావిస్తున్నాయి.

హమాస్‌ మూకలు గత ఏడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్‌పై జరిపిన దాడిలో దాదాపు 1,200 మంది మరణించిన విషయం తెలిసిందే. మరో 253 మందిని బందీగా చేసుకున్నారు. దీనికి ప్రతీకారంగా హమాస్‌ పాలనలోని గాజా నగరంపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున వైమానిక, భూతల దాడులకు పాల్పడుతోంది. దీంతో ఇప్పటి వరకు తమ భూభాగంలో దాదాపు 29,900 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 70,215 మంది గాయపడ్డట్లు పేర్కొంది.