Balagam: చిన్న సినిమా పెద్ద అవార్డులు!

ఈమధ్య కాలంలో చిన్న సినిమాలుగా వచ్చి ప్రేక్షకులను మెప్పించిన తెలుగు సినిమాల సంఖ్య ఎక్కువే. తెలుగు ప్రేక్షకులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులనూ అలరిస్తున్నాయి టాలీవుడ్​ సినిమాలు. తాజాగా ఆర్​ఆర్​ఆర్​ సినిమా అంతర్జాతీయ వేదికపై ఆస్కార్​తో మురిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరిన్ని తెలుగు సినిమాలూ అంతర్జాతీయ వేదికలపై సత్తాచాటి అవార్డులు అందుకున్నాయి. కృష్ణతత్వంతో తెరకెక్కిన కార్తికేయ2, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా రూపొందిన బలగం సినిమాలు అంతర్జాతీయ అవార్డులను అందుకుని మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయి.

కమెడియన్ వేణు ఎల్దండి డైరెక్టర్‌గా రూపొందించిన సినిమా ‘బలగం’. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా మార్చి 3న రిలీజ్​ అయిన ఈ సినిమా, అంచనాలకు అందని రీతిలో ప్రేక్షకుల ప్రశంసలందుకుంది. భారీ బడ్జెట్​ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన బలగం సినిమాను ఆదరించి కలెక్షన్ల వర్షం కురిపించారు. ఫలితంగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఇక, తాజాగా బలగం సినిమా ప్రపంచవేదికపై సత్తా చాటింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బలగం సినిమాకు ఏకంగా రెండు అవార్డులు దక్కాయి. ఈ విషయాన్ని బలగం హీరో ప్రియదర్శి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో వైరల్​ అయ్యింది. లాస్ ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులను బలగం గెలుచుకుంది.

కాగా, నిఖిల్ సిద్దార్థ్​, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కార్తికేయ 2. కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్​ చేసి పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించింది. బాలీవుడ్​ సీనియర్​ నటుడు అనుపమ్​ ఖేర్​ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించి మొత్తం సినిమాకే హైలెట్​గా నిలిచారు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన సిద్దార్థ్​  నేషనల్ వైడ్ లో అవార్డులు సాధిస్తున్నాడు. ఇప్పటికే ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ పాపులర్ ఛాయస్ అవార్డుని అందుకున్నాడు. దీంతో పాటు ఇదే ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో కార్తికేయ సినిమాకు మరో రెండు అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా నిఖిల్ కార్తికేయ 2 సినిమాకు గాను నేషనల్ లెవల్ లో మరో అవార్డుని అందుకున్నాడు. OTT ప్లే అనే సంస్థ అందిస్తున్న ఛాలెంజ్ మేకర్ అవార్డుల్లో ట్రైయల్​బ్రేజర్​ ఆఫ్​ ది ఇయర్​ అనే అవార్డు కార్తికేయ 2 సినిమాకు గాను నిఖిల్ సిద్దార్థ్ గెలుచుకున్నాడు. అవార్డు అందుకున్న నిఖిల్​ ఫొటో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ కాగా, నెటిజనులంతా శుభాకాంక్షలు చెబుతున్నారు.