Ravi River: పాకిస్తాన్‌కి షాక్.. రవి నది నీటిని నిలిపేసిన భారత్

Ravi River: ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు (pakistan) తాజాగా భారత్ (India) మరో కోలుకోలేని దెబ్బ కొట్టింది. అసలు భారత్ పాక్ మధ్య 1947 నుంచి ఎన్నో విబేధాలు ఉన్నాయి. సరిహద్దులు, కాశ్మీర్, నీటి పంపకం సహా ఉగ్రవాదం ఇలా ఎన్నో ఘర్షణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎప్పుడూ పాక్‌పై భారత్‌ పై చేయి సాధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్‌కు వెళ్లే రావి నది నీటిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. రావి నది నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే నీటిని మళ్లించి వాటిని జమ్మూ కాశ్మీర్‌లో సాగు భూమికి ఆ నీటిని అందించాలని భావిస్తోంది.

భారత్ పాకిస్థాన్ మధ్య ఉన్న సింధు నది దాని ఉప నదులకు చెందిన జలాలను సమర్థవంతంగా వాడుకునేందుకు భారత్ సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మిస్తున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం చివరి దశకు చేరుకోవడంతో భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్తున్న రావి నది నీటి ప్రవాహాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపేసినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి పాకిస్తాన్‌లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌కు తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే పాక్‌కు వెళ్లే రావి నది నీటిని మళ్లించి కథువా, సాంబా జిల్లాల్లోని 32 వేల హెక్టార్ల భూమికి సాగు నీరుగా అందించనున్నారు.

షాపూర్ కంది బ్యారేజీ పూర్తి కావడంతో షాపూర్ వద్ద నీటి నిలుపుదల ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. భారత్-పాక్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రిటీ ప్రకారం.. భారత్ ఇప్పుడు రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోనుంది. గతంలో పాత లఖన్‌పూర్ డ్యామ్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించే నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్‌లకు మళ్లించి అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయనున్నారు.

1995లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య తలెత్తిన విబేధాల కారణంగా దశాబ్దాల పాటు ఈ ప్రాజెక్టు ముందుకు పడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జోక్యం చేసుకునే వరకు ఈ ప్రాజెక్టు పనులు కదల్లేదు. 2018 తర్వాత ఈ షాపూర్ కంది బ్యారేజీ పనులు తిరిగి ప్రారంభం అయ్యాయి. రూ. 3300 కోట్ల విలువైన ఈ షాపూర్ కంది ప్రాజెక్టు ద్వారా సాగు నీటితో పాటు 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతం పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానిక వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల సింధు నది మరో ఉపనది అయిన చీనాబ్ నది నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌‌ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసేందుకు చీనాబ్ నది నీటిని మళ్లించింది. సింధూ నదీ జలాలపై 1960 లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కు తూర్పున ఉన్న నదులు అయిన బియాస్, రావి, సట్లేజ్‌లు.. పాకిస్తాన్‌కు సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.