ఎండలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వడగండ్ల వర్షంతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత ఉన్నట్టుండి ఎక్కువైంది. అయితే ఏపీలో వాతావరణం భిన్నంగా వుంది. ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు అకాల వర్షాల కారణంగా రైతులు కష్టాల పాలవుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే వుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల 2 సెంటీ మీటర్లకుపైగానే వర్షపాతం నమోదవుతోంది. శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా రాయలసీమలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రేణిగుంటలో నిన్న అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా కందుకూరులో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అన్నమయ్య, చిత్తూరు, విశాఖపట్టణం, నంద్యాల, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.
తెలంగాణలో ఇలా..
రాష్ట్రంలో 4 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారంతోపాటు వచ్చే నెల మూడో తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎండలు మండనున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో గరిష్ఠంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్నగర్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి…
శుక్రవారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు తెలంగాణలోని ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ రంగు సూచికను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో రంగు సూచికను జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీలను దాటితే వాతావరణ శాఖ మూడు రకాల సూచనలను జారీ చేస్తుంది. 36-40 డిగ్రీల మధ్య ఉంటే యెల్లో (పరిశీలన), 41-45 డిగ్రీల మధ్య ఉంటే ఆరెంజ్ (అప్రమత్తం), 45 డిగ్రీలపైన ఉంటే రెడ్ (హెచ్చరిక) సంకేతాలను జారీ చేస్తుంది.