Gummanur: జ‌గ‌న్‌కు గుడ్ బై .. గుమ్మనూరు జయరాం రాజీనామా!?

Gummanur Jayaram: YSRCP నేత గుమ్మనూరు జ‌య‌రాం పార్టీకి గుడ్ బై చెప్పే యోచ‌న‌లోఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేస్తార‌ని ఎప్ప‌టినుంచో విన‌ప‌డుతున్నా రాప్తాడు స‌భ‌కు డుమ్మా కొట్ట‌డం దీనికి మరింత ఊతం ఇచ్చిన‌ట్లు అయ్యింది. కీల‌క నేత‌ల రాజీనామాల‌తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ నిరాక‌రించ‌డంతో క‌ర్నూల్ ఎంపీ సంజీయ్ కుమార్ ముందుగానే వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు అదే పార్టీలో మ‌రికొంద‌రు ఉన్నారు. మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం కూడా పార్టీని వీడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఆలూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఈయ‌న‌కు క‌ర్నూల్ ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఇందుకు జ‌య‌రాం ఒప్పుకోలేదు. ప‌లుమార్లు తాడేప‌ల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని బుజ్జ‌గించారు. ఎంపీ టికెట్‌పై పోటీ చేయాల‌ని శ‌త‌విధాలుగా న‌చ్చ‌జెప్పాల‌ని చూసారు. కానీ జ‌య‌రాం అస్స‌లు ఒప్పుకోలేదు. మ‌రోవైపు ఆలూరు అసెంబ్లీ టికెట్‌ను త‌న వ్య‌తిరేక వ‌ర్గానికి చెందిన చిప్ప‌గిరి జ‌డ్పీటీసీ విరూపాక్ష‌కు ఇవ్వ‌డం జ‌య‌రాంకు న‌చ్చ‌లేదు. ఈ విష‌యంలో తాడేప‌ల్లి ప్యాలెస్ పెద్ద‌ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు సైతం దూరంగా ఉంటున్నారు.  వాస్త‌వానికి గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌కు రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల్లో అనుభ‌వం ఉంది. 2011లో తెలుగు దేశం (Telugu Desam Party) నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేసారు. మొద‌ట తెలుగు దేశం MPTCగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత 2006లో సైకిల్ పార్టీ నుంచి చిప్ప‌గిరి ZPTCగా పోటీ చేసి గెలిచారు. (Gummanur)

ALSO READ: Janasena: ఆశ‌లు అడియాస‌లై..!

2009లో ప్ర‌జారాజ్యం (Praja Rajyam) పార్టీ అభ్య‌ర్ధిగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2012లో YSRCPలో చేరారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జ‌గ‌న్ క్యాబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నారు. అయితే మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌నే గుమ్మ‌నూరు జ‌య‌రాం ఆశ‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) నీళ్లు చ‌ల్లారు. క‌ర్నూలు ఎంపీగా పోటీ చేయాల‌ని ఆదేశించి పార్టీ పెద్ద‌ల‌పై తిరుగుబాటు చేసారు. న‌చ్చ‌ని చోట ఉండ‌లేక పార్టీకి గుడ్ బై చెప్పేందుకు గుమ్మ‌నూరు జ‌య‌రాం. త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) చెంత‌కు చేరాల‌ని చూస్తున్నారు.

రేపో మాపో YSRCPకి రాజీనామా చేసి తెలుగు దేశం తీర్థం పుచ్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. జ‌య‌రాం తెలుగు దేశం పార్టీలో చేరితే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా లేదా అనే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు అసెంబ్లీ సీటును ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం. తెలుగు దేశం, జ‌న‌సేన (Janasena) పార్టీల అభ్య‌ర్ధులు తొలి జాబితాలో ఈ సీటును ప‌క్క‌న పెట్టారు. మంత్రి జ‌య‌రాం YSRCPని వీడితే ఆ పార్టీ ఆలూరు అభ్య‌ర్ధిపై ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. దీంతో వైసీపీ అభ్య‌ర్ధి విరూపాక్ష టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. ఈ మంత్రి అనుచ‌రులు విరూపాక్షకు స‌హ‌క‌రించ‌డంలేద‌నే టాక్ ఉంది. మ‌రోవైపు జ‌య‌రాం సోద‌రుడు గుమ్మ‌నూరు నారాయ‌ణ (Gummanur Narayana) ఆలూరు వ్య‌వ‌సాయ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేసారు.

పార్టీలో ప్రాధాన్య‌త లేద‌ని విమ‌ర్శించారు. జ‌య‌రాంతో క‌లిసి పార్టీని వీడే ఆలోచ‌న‌లో ఉన్నారు. మొత్తం మీద జ‌య‌రాం పార్టీ మారితే వైసీపీకి భారీ షాక్ త‌ప్ప‌ది భావిస్తున్నారు. ఉమ్మ‌డి క‌ర్నూల్ జిల్లా వైసీపీకి కంచుకోటే. కానీ పార్టీ పెద్ద‌ల నిర్ణ‌యాల‌తో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ గోడ‌ల‌కు బీట‌లు వార‌డ‌మే కాదు ఏకంగా బ‌ద్ధ‌ల‌య్యే ప‌రిస్థితులు త‌లెత్తుతున్నాయి. పార్టీ కీల‌క నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు మెల్లగా జారుకుంటున్నారు.