హీరో నమిలిన‌ చూయింగ్ గ‌మ్.. 40 ల‌క్ష‌లు!

ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ అంటే తెలియ‌నివారు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదేమో. మార్వెల్ సినీమాటిక్ యూనివ‌ర్స్‌లో ఐరన్ మ్యాన్ పాత్ర‌లో న‌టించి కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వైర‌ల్ అవుతోంది. రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ న‌టించిన ఐర‌న్ మ్యాన్ క్యారెక్ట‌ర్ ఎంత పాపుల‌ర్ అయిపోయిందంటే.. ఆయన న‌మిలిన చూయింగ్ గ‌మ్‌ను కొనుక్కోవ‌డానికి ల‌క్ష‌ల్లో వేలం పాట పాడుతున్నారు.

అస‌లు ఆ చూయింగ్ గ‌మ్ క‌థేంటంటే.. ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ వెబ్‌సైట్ ఈబేలో ఓ వ్య‌క్తి ఇది రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ న‌మిలిన చూయింగ్ గ‌మ్ అని పేర్కొంటూ వేలానికి పెట్టాడు. ఆ చూయింగ్ గ‌మ్ అత‌నికి దొరికింద‌ట‌. గ‌త నెల‌లో ప్ర‌ముఖ హాలీవుడ్ న‌టుడు, నిర్మాత జాన్ ఫావ్రో హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేం అనే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ కూడా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో రాబ‌ర్ట్ చూయింగ్ గ‌మ్ తింటున్నారు. ఆయ‌న్ను స‌త్క‌రిస్తున్న స‌మ‌యంలో రాబ‌ర్ట్ త‌న నోటిలో ఉన్న చూయింగ్ గ‌మ్‌ను అక్క‌డే ఊసేసార‌ట‌. అదే వేడుక‌లో పాల్గొన్న ఓ వ్య‌క్తి ఆ చూయింగ్ గ‌మ్‌ను జాగ్ర‌త్త‌గా త‌న వ‌ద్ద ఉంచుకున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని అన‌తు ఈబేలో వెల్ల‌డించాడు.

అయితే చాలా మంది అది రాబ‌ర్ట్ డౌనీ జూనియ‌ర్ న‌మిలిన గ‌మ్ అని ఎలా న‌మ్మాలి అని అడుగుతున్నారు. ఇందుకు అత‌ను కావాలంటే ఆ చూయింగ్ గ‌మ్‌లో ఉన్న ఎంగ‌లిని, రాబర్ట్ డౌనీ జూనియ‌ర్ ఎంగిలితో డీఎన్ ఏ టెస్ట్ చేసుకోండి అని ధీమాగా చెప్తున్నాడు. అంతేకాదు ఈబే దాని ప్రారంభ ధ‌ర‌ 40 ల‌క్ష‌ల‌కు పెట్టింది. ఏప్రిల్ 1వ‌ర‌కు వేలం పాట ఉంటుంద‌ని, ఎవ‌రు ఎక్కువ ప‌లికితే వారికే ఆ చూయింగ్ గ‌మ్ ద‌క్కుతుంద‌ని తెలిపింది. గెలుచుకున్న వారికి ఆ చూయింగ్ గ‌మ్‌ను జాగ్ర‌త్త‌గా ప్లాస్టిక్ కంటైన‌ర్‌లో పెట్టి డెలివ‌ర్ చేస్తామ‌ని ఈబే సంస్థ ప్ర‌క‌టించింది.