Janasena: ఆశలు అడియాసలై..!
Janasena: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) జనసేన కేవలం 24 సీట్లలోనే పోటీ చేయనుంది అనే దానికంటే తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) 24 సీట్లే ఇచ్చారు అనడం బెటరేమో..! 2019 ఎన్నికల్లో కనీసం పది స్థానాలను దక్కించుకుని ఉంటే ఈరోజు ఎక్కువ సీట్లు అడిగేవాడినని జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటున్నారు.
భారతీయ జనతా పార్టీ (BJP) కూడా విలీనం అవుతుంది కాబట్టి ఆ పార్టీతో పొత్తు కోసమే తాను సీట్లను త్యాగం చేయాల్సి వచ్చిందని కూడా చెప్పారు. ఎప్పుడైతే జనసేనకు 24 సీట్లు అని ప్రకటించారో అప్పుడే జనసైనికులు, కార్యకర్తల ఆశలు అడియాసలయ్యాయి. తమ నాయకుడిని గెలిపించుకోవడానికి జనసైనికులు ఎంతో కష్టపడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఇంత కష్టపడేది తమ నాయకుడిని గెలిపించుకోవడం కోసమే. అయితే ఎప్పుడైతే జనసేనకు 24 సీట్లు అన్నారో వారి ఆశల పల్లకి ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఇంత కష్టపడేది చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేయడానికా? అన్న టాక్ మొదలైపోయింది.
ALSO READ: బాబు మార్క్.. జగన్ షాక్..!
ఇంతటి ప్రతికూల స్పందన బహుశా పవన్ కళ్యాణ్ కూడా ఊహించి ఉండరు. పవన్ కళ్యాణ్‌కి వరుస డిజాస్టర్లు పడినప్పుడు, పవన్ రెండు చోట్లా ఓడిపోయినప్పుడు కూడా పవన్ వెనుక నడిచిన అభిమానులు సైతం నిరాశ చెందినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అందరూ నిరాశ వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పలేం కానీ మెజారిటీ జనసైనికులు, కార్యకర్తుల అభిప్రాయం ఇలాగే ఉంది. ఇంకొందరైతే.. 2019 ఎన్నికల సమయంలో పార్టీ 24 సీట్లు ఓడిపోయిందని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 24 సీట్లకు ఒప్పుకున్నారని లేని పోని కంపేరిజన్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. (Janasena)
ఇంకో 15 సీట్లు అదనంగా అడిగితే బాగుంటుందని.. లేదంటే గతంలో అభిమానులే ఓట్లు వేయలేదు అనే మాట ఇప్పుడు నిజం అవుతుందని ఇంకొందరు జనసేనను ట్యాగ్ చేస్తూ సలహాలు ఇస్తున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు సరే.. కానీ అన్ని ఎన్నికలు ఒకేలా ఉండవు. ఎంత కాదన్నా 15 శాతం వరకు సీట్లను అడిగినా బాగుండేది. ఎన్నికల తర్వాత అధికారంలోకి రాబోయేది జనసేన, తెలుగు దేశం కూటమే అని పవన్ ఎన్నో సార్లు ధీమా వ్యక్తం చేసారు. గెలుస్తారు సరే.. మరి పవర్ షేరింగ్ ఉంటుందా? పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరికతోనే ప్రచారంలో భాగంగా ఎంతో కష్టపడుతున్న జనసైనికుల కల నెరవేతుందా? సీట్ల షేరింగ్ సమయంలోనే పవర్ షేరింగ్ గురించి పవన్ అడగలేదా? మా జనసైనికులు గెలిపిస్తారు… మీరే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండండి అని చంద్రబాబు నాయుడుతో పవన్ చెప్పేస్తారా? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
అందుకే 24 ఇచ్చారు: వర్మ
ఓ పక్క ఎవరి టెన్షన్లలో వారు ఉంటే.. మరో పక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడుతున్నారు. 24 గంటలు జనానికి అందుబాటులోఉంటామని చెప్పడానికి 24 సీట్లు తీసుకున్నారని.. తన జీవితంలో పవన్ కళ్యాణ్ కోసం, జనసైనికుల కోసం పడినంత బాధను తాను ఎవ్వరి కోసం పడలేదని సటైర్లు వేస్తున్నారు. నీ లెక్కకు ఏమైనా తిక్కుందా అని ఏకంగా పవన్ కళ్యాణ్‌ని ట్యాగ్ చేసి మరీ రెచ్చగొడుతున్నారు. 23 ఇస్తే తెలుగు దేశం పార్టీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు….25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు…అందుకే మధ్యే మార్గంగా 24 తీసుకున్నట్లున్నారు అంటూ చురకలు అంటిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.