Joe Root: సెంచరీతో చెలరేగిన జోరూట్
రాంచీ పిచ్ పై టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. అతడు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పేలా భారత బౌలర్లు విజృంభించారు. అరంగ్రేట బౌలర్ ఆకాశ్ దీప్ ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. బెన్‌డకెట్ (11), ఓలి పోప్ (0), జాక్ క్రాలీ (42) వికెట్లను పడగొట్టాడు. జానీ బెయిర్‌స్టో (38) ను అశ్విన్, బెన్‌స్టోక్స్ (3) ను జడేజా లు ఔట్ చేయడంతో లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 112 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
లంచ్ అనంతరం బెన్‌ఫోక్స్ (47; 126 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్) జతగా ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను రూట్ భుజాన వేసుకున్నాడు. వీరిద్దరు భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశారు. గత కొంతకాలంగా ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్‌బాల్ ఆటతీరును వీరిద్దరు పక్కన పెట్టి అసలు సిసలు టెస్టు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరు భారత బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో ఈ సెషన్లో భారత్‌కు ఒక్క వికెట్ దక్కలేదు. ఈ సెషన్లో ఇంగ్లాండ్ 86 పరుగులు చేసింది.
టీ విరామం తరువాత ప్రమాదకరంగా మారిన ఈ జోడిన బెన్ఫోక్స్ను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ విడదీశాడు. రూట్-ఫోక్స్ జోడి ఆరో వికెట్ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరికాసేటికే టామ్‌హార్డ్లీ(13) ని సైతం సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో ఇంగ్లాండ్ 245 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లాండ్ ఆలౌట్ కావడానికి ఎంతో సమయం పట్టదని అనిపించింది.
ఓ వైపు వికెట్లు పడుతున్నా కూడా రూట్ తన సహజశైలిలో ఆడుతూ.. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 219 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. టెస్టుల్లో రూట్‌కు ఇది 31వ సెంచరీ కాగా.. భారత్ పై 10వ సెంచరీ కావడం విశేషం. మరో వైపు రాబిన్సన్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. రూట్-రాబిన్సన్ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్ కు 89 బంతుల్లోనే 57 పరుగులు జోడించారు.