Ambati Rambabu: ప‌వ‌న్‌కి పావు వంతు సీట్లు కూడా ఇవ్వ‌లేదు

Ambati Rambabu: ఈరోజు తెలుగు దేశం (Telugu Desam Party), జ‌న‌సేన (Janasena) పార్టీ అధినేత‌లు చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu), ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) క‌లిసి రానున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో (AP Elections) ఎన్ని సీట్ల‌లో పోటీ చేస్తున్నారో ప్ర‌క‌టించారు. 118 సీట్లతో తెలుగు దేశం, జనసేన పార్టీల తొలి జాబితా విడుద‌ల చేసింది. 118లో జ‌న‌సేన 24 సీట్ల‌లో పోటీ చేయ‌నుంది. మిగ‌తా సీట్ల‌లో తెలుగు దేశం పార్టీ పోటీకి దిగుతోంది.

అయితే పావు వంతు సీట్ల‌ను కూడా తెలుగు దేశం పార్టీ జ‌న‌సేన‌కు ఇవ్వ‌లేద‌ని YSRCP మంత్రి అంబ‌టి రాంబాబు (Ambati Rambabu) సెటైర్ వేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ల్లకి మోయ‌డానికే ప‌నికొస్తాడు ఛీ అని ట్వీట్ చేసారు. ఎప్పుడెప్పుడు జ‌న‌సేన‌, తెలుగు దేశం పార్టీలు ప్రెస్ మీట్లు, స‌భలు పెడ‌తాయా? ఎప్పుడెప్పుడు వారిపై ట్విట‌ర్ ద్వారా కామెంట్స్ చేసి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) ద‌గ్గ‌ర మార్కులు కొట్టేద్దామా అని వేచి చూస్తుంటారు అంబ‌టి రాంబాబు.

ALSO READ: TDP Janasena: 24 సీట్ల‌లో జ‌న‌సేన‌.. మిగిలిన‌వాటిలో TDP

2019తో పోల్చుకుంటే ఈ సారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాస్త ప‌రిణ‌తి సాధించిన జ‌న‌సేన ఎంత కాద‌న్నా ఒక 50 సీట్ల‌లో పోటీ చేస్తుంద‌ని అంద‌రూ భావించారు. అది కాస్తా 40కి 30కి వచ్చి చివ‌రికి 24 ద‌గ్గ‌ర కూర్చుంది. ఇంత త‌క్కువ సీట్లా? అని అడుగుతున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులకు జ‌న‌సేనాని పవ‌న్ క‌ళ్యాణ్ ఒక్క‌టే స‌మాధానం ఇచ్చారు.

2019 ఎన్నిక‌ల్లో తాను క‌నీసం 10 స్థానాల‌ను గెలిచి ఉంటే అప్పుడు 50 ఏంటి 70 సీట్లు కూడా అడిగి ఉండేవాడిన‌ని అన్నారు. అలా గెల‌వ‌దు కాబ‌ట్టే ఇప్పుడు 24 సీట్ల‌తో స‌రిపెట్టుకుంటున్న‌ట్లు తెలిపారు. అస‌లు తెలంగాణ‌లో బ‌ల‌మే లేని జ‌న‌సేన 2023లో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో 119 సీట్లలో 8 చోట్ల పోటీ చేసింది. కాస్తో కూస్తో బలమున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం 175 సీట్లలో 24 చోట్ల పోటీ చేస్తోంది. ఇక్క‌డ ఇంకో బొక్క ఉంది. ఒక‌వేళ తెలుగు దేశం, జ‌న‌సేన‌తో భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) కూడా క‌లిస్తే జ‌న‌సేన‌కు ద‌క్కిన 24 సీట్ల‌లో 3 లేదా 4 సీట్లు ఆ పార్టీకే వెళ్లిపోతాయి.

జ‌న‌సేన ప‌దేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో 24 సీట్ల‌లో మాత్ర‌మే పోటీ చేస్తోందంటే సాహ‌స‌న‌మే చెప్పాలి. భార‌తీయ జ‌న‌తా పార్టీతో పొత్తు కోస‌మే తాను సీట్ల‌ను త్యాగం చేయాల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ ప‌దే ప‌దే చెప్తున్నారు. కానీ ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అడిగిన‌న్ని సీట్లు చంద్ర‌బాబు నాయుడు ఇవ్వ‌డానికి ఒప్పుకోలేద‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో ఇప్పుడు సీట్ల షేరింగ్ అంశంలో గొడ‌వ‌ప‌డితే అది YSRCPకి ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌ని భావించి ప‌వ‌న్ సైలెంట్ అయిపోయారు.

ముందు నుంచీ హెచ్చ‌రిస్తున్న అంబ‌టి

అయితే.. అంబ‌టి రాంబాబు ఓ ప‌క్క ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని తిడుతూనే మ‌రోప‌క్క ఆయ‌న మంచి కోరుతున్న‌ట్లు ముందు నుంచీ ఈ సీట్ల షేరింగ్ విష‌యంలో హెచ్చ‌రిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెల‌వ‌డానికే చంద్ర‌బాబు నాయుడు ప‌వ‌న్‌ను వాడుకుంటున్నాడ‌ని.. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికైనా ప‌వ‌న్ అర్థం చేసుకోవాల‌ని అంబ‌టి రాంబాబు ప‌లుమార్లు ట్వీట్లు చేసారు. చంద్ర‌బాబు ముందు అన్నింటికీ ఒప్పుకుని ఆ త‌ర్వాత హ్యాండ్ ఇచ్చే టైప్ అని అన్నారు.

ALSO READ: Ambati Rambabu: “దీపాల‌తో సిగ‌రెట్ అంటించుకునే నీకెందుకు?”

పదవి మోజు తప్ప ప్రజాసేవ పట్టని, 14 ఏళ్ల అసమర్థ మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు అని.. అవకాశం ఇస్తే సొంత నియోజకవర్గాలకి ఎంతో మంచి చేసుకున్న ముఖ్యమంత్రులని చూసాం కానీ చంద్రబాబు ఇతర నియోజకవర్గాలకి ఏం చేయకపోగా… తన సొంత నియోజకవర్గమైన కుప్పంకి కనీసం నీళ్లు, రోడ్లు ఇవ్వలేని అసమర్థుడుగా చరిత్రలో మిగిలిపోయాడని ఆరోపించారు.

కుప్పంలో ఎదురుగాలి వీస్తుండటంతో సింపతీతో అయినా గెలవాలని తంటాలు తప్పితే, ఈ రోజుకి కుప్పంకి ఏం చేస్తాడో, ఏం చేశాడో చెప్పుకునే స్థితిలో లేని అసమర్థ బాబు అని విమ‌ర్శ‌లు గుప్పించారు. పదవి పిచ్చితో నోటికొచ్చిన హామీలు ఇవ్వడమే తప్పితే ఆచరణలో మాత్రం ఆయన తన హామీలు నెరవేర్చినట్టు చ‌రిత్ర‌లోనే లేద‌ని ప‌లుమార్లు అంబ‌టి రాంబాబు విమ‌ర్శ‌లు చేసారు. అలాంటి చంద్ర‌బాబు నాయుడుతో చేతులు క‌లిపితే న‌ష్టపోయేది జ‌న‌సేనే అని హెచ్చ‌రించారు.