బాబాయ్​, అబ్బాయ్​కి నెట్​ఫ్లిక్స్​ షాక్!

ఫ్యామిలీ హీరోగా దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విక్టరీ వెంకటేష్. వెంకీ​ సినిమా అంటే కుటుంబమంతా కూర్చొని చూసే సినిమా అని భావిస్తారంతా. కానీ తాజాగా వెంకటేష్​ నటించిన రానా నాయుడు వెబ్​ సిరీస్​ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.  విడుదలైన నాటినుంచి విమర్శల పాలైన ఈ సిరీస్​ తెలుగు వెర్షన్​ని తాజాగా నెట్​ఫ్లిక్స్​ తొలగించినట్లు తెలుస్తోంది.

దగ్గుబాటి వెంకటేష్​, రానా కలిసి నటించిన మొదటి ప్రాజెక్ట్​ రానా నాయుడు. ఈ వెబ్​ సిరీస్​ విడుదలైన రోజు నుంచీ అటు ప్రేక్షకులు, ఇటు సెలబ్రిటీలు దీనిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మల్టీస్టారర్లకి కేరాఫ్​ అడ్రస్​ అయిన వెంకటేష్​ తన అన్న సురేష్​ బాబు కొడుకు రానాతో కలిసి నటిస్తున్నారంటే  ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ బాబాయ్​, అబ్బాయ్ కలిసి వచ్చిన రానా నాయుడు ఊహించని రీతిలో అభిమానులను నిరాశ పరిచింది. శృంగార దృశ్యాలు ఎక్కువగా ఉండటం, ఫ్యామిలీ హీరోగా పేరుగాంచిన వెంకటేష్​ నోట బూతులు పలికించడంతో సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. చివరకు నెట్​ఫ్లిక్స్​ కూడా ఈ సిరీస్​ తెలుగు వెర్షన్​ని తీసేసే పరిస్థితి వచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్​లో మంచి ఫామ్​లో ఉన్న నటులు వెంకటేష్, దగ్గుబాటి రానా. దృశ్యం, నారప్ప సినిమాలతో భిన్నమైన కథలు, రీమేక్​లతో కూడా మెప్పించగలనని నిరూపించారు వెంకీ. రానా, వెంకటేష్​ ఒకేసారి రానా నాయుడు సిరీస్​తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సిరీస్ లో రానా, వెంకటేష్ ఇద్దరు తండ్రీ కొడుకులుగా నటించడం విశేషం. ఇక, ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ నిర్మించగా సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ను మొదటగా హిందీలో చిత్రీకరించారు తర్వాత తెలుగులో డబ్ చేశారు. రిలీజ్ తర్వాత ఇందులోని బూతులపై చెప్పలేనంత ట్రోలింగ్, వ్యతిరేకత వచ్చింది.

ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ ‘రే డోనోవర్’ కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా నిర్మించారు. బాలీవుడ్ హాట్ బ్యూటి సుర్విన్ చావ్లా ఇందులో రానాకు జోడీగా నటించింది. ఇక ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు.

మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న రానా నాయుడు వెబ్ సిరీస్ పై విడుదలైనప్పటి నుంచి వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువగా బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్ ఉండటంతో స్వయంగా వెంకీ, రానానే ప్రమోషన్స్​లో భాగంగా కుటుంబంతో కలిసి చూడొద్దని చెప్పారు. నెట్​ఫ్లిక్స్​ కూడా ప్రేక్షకులకు అదే విషయాన్ని సూచించింది. అయితే ఇలా హిందీ, ఇంగ్లీషు వెర్షన్స్​ని యాక్సెప్ట్ చేసిన తెలుగు ప్రజలు తెలుగులో మాత్రం అంగీకరిచలేకపోయారు. అంతేకాదు శివకృష్ణ, విజయ శాంతి వంటి పలువురు సెలబ్రిటీలు కూడా రానా నాయుడు సిరీస్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రానా నాయుడు సిరీస్ కు సంబంధించిన తెలుగు ఆడియోను నెట్ ఫ్లిక్స్ తొలిగించింది. అయితే.. ఈ విషయాన్ని నెట్​ఫ్లిక్స్​ అధికారికంగా ప్రకటించలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఈ సిరీస్​ విడుదలైనప్పటి నుంచీ రికార్డు వ్యూస్​తో ట్రెండింగ్​లోనే ఉండటం విశేషం.