Pawan Kalyan: ప‌రిణితి చెందారు.. ప‌వ‌ర్ మంత్రం ప‌ట్టేసారు

Pawan Kalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా ప‌రిణ‌తి చెందిన‌ట్లు.. ప‌వ‌ర్ మంత్రాన్ని ప‌ట్టేసిన‌ట్లున్నారు. ఆయ‌న ఇటీవ‌ల చేసిన ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లే ఈ మాట చెప్తున్నాయి. బ‌డ్జెట్ పాలిటిక్స్‌పై సేనాని చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. నిజానికి మ‌నంద‌రం అంద‌మైన అబ‌ద్ధంలో బ‌తుకుతున్నాం. జీరో బ‌డ్జెట్ రాజ‌కీయం అంటే కుద‌ర‌డంలేదు. ఇంకో ఐదు, ప‌దేళ్ల‌కు మార్పు రావాల‌ని ఆశిద్దాం. కార్య‌క‌ర్త‌ల‌తో భోజ‌నాల‌పైనా స‌రిగ్గా పెట్టాలి క‌దా. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల మేర‌కైనా ఖ‌ర్చు చేద్దామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌లు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేస్తున్నాయి.

రాజ‌కీయ పార్టీ అన్నాక ఖ‌ర్చు చేయాలి. పార్టీ ప‌రంగా చేసే ఖ‌ర్చుకి అద‌నంగా అభ్య‌ర్ధులు ఖ‌ర్చే చేస్తారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వేసిన లెక్క కంటే అద‌నంగా ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు అవుతోంది అన్న‌ది బ‌హిరంగ ర‌హస్యం. ఈ విష‌య‌మై గ‌తంలో ప‌లువురు ప్ర‌జా ప్ర‌తినిధులు బ‌హిరంగంగా నోరు జారి నాలుక క‌ర్చుకున్నారు. కానీ జ‌న‌సేన (Janasena) పార్టీ మాత్రం నిఖార్సైన రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చింది. జ‌న‌సేన అభ్య‌ర్ధులు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి మాత్రమే కాదు అంత‌క‌న్నా చాలా చాలా త‌క్కువ ఖ‌ర్చు చేస్తూ వ‌స్తున్నారు.

రాజ‌కీయాల్లో నీతివంత‌మైన ఎన్నిక‌లు అనేవి అసాధ్యం. ఓటుకు ఐదు వేలా ప‌ది వేలా అని బాహాటంగా ఓట‌ర్లే రాజ‌కీయ పార్టీల‌ను నిల‌దీస్తున్న రోజులివి. త‌మ గ్రామాల్లో ఓటుకు నోటు పంచ‌లేద‌ని ధ‌ర్నాలు చేసే రోజుల్లో బ‌తుకుతున్నాం. ఒక్కో కార్య‌క‌ర్త‌ను వెంట తిప్పుకోవాలంటే రోజుకు వెయ్యి నుంచి రూ.2000 వ‌ర‌కు స‌మ‌ర్పించుకోవాల్సిందే. జ‌న‌సేన‌కు ఆ స‌మ‌స్య లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులే ఈ జ‌న‌సైనికులు. వారే జ‌నసేన కార్య‌క‌ర్త‌లు. పార్టీ

వీరి కోసం ఖ‌ర్చు చేయాల్సిన ప‌నిలేదు. నాయ‌కులూ ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇప్పుడు ఇది వ‌ర్క‌వుట్ కావ‌డంలేదు. అందుకే కార్య‌క‌ర్త‌ల‌ను బాగా చూసుకోండి. వారికి భోజ‌నాలైనా పెట్టాలి క‌దా అని పార్టీ నేత‌ల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచాలా వ‌ద్దా అనేది మీ ఇష్టం అని నేత‌ల‌కు చెప్పారు. ప‌వ‌న్ తాజా వ్యాఖ్య‌లు చూస్తే ఒక ర‌కంగా ఆయ‌న వాస్త‌వ ప‌రిస్థితుల‌ను చాలా ద‌గ్గ‌ర నుంచి అర్థం చేసుకున్నార‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు. (Pawan Kalyan)

రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం వ్య‌తిరేక ఓట్లు చీల‌కూడ‌దంటూ మొద‌టి నుంచి చెప్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పొత్తు కోసం తాను ప‌డ్డ క‌ష్టాల‌ను శ్ర‌మ‌ల‌ను వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. ఇందులో భాగంగా చేతులు జోడించి మ‌రీ BJPని అడిగిన‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. ఈ నేప‌థ్యంలో తెలుగు దేశానికి జ‌న‌సేన ఓట్లు ట్రాన్స్‌ఫ‌ర్ పైనా మాట్లాడారు. తాజాగా కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడిన ప‌వ‌న్.. తెలుగు దేశం, BJP పార్టీల‌తో పొత్తు కోసం జ‌న‌సేన ఎంతో క‌ష్ట‌ప‌డిన‌ట్లు చెప్పారు.

ఇందులో భాగంగా BJP జాతీయ నాయ‌క‌త్వంతో ఎన్నో మాటలు ప‌డిన‌ట్లు తెలిపారు. తాను ఇంత ఓర్పుతో అన్ని మాట‌లు భ‌రిస్తుంది కేవ‌లం YSRCP అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) రాక్ష‌స పాల‌న‌ను పార‌ద్రోల‌డానికే అని ప‌వ‌న్ అన్నారు. అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ర‌క్షించుకోవ‌డం కోస‌మే అని మ‌రోసారి స్ప‌ష్టం చేసారు. అందువ‌ల్లే ఓట్లు చీల‌కుండా ఉండాల‌ని కోరారు. ఈ ప్ర‌యత్నం కోసం ఎంత‌గా న‌లిగిపోయానో తానొక్క‌డికే తెలుస‌ని ప‌వ‌న్ చెప్పారు. ఇదంతా తాను జ‌న‌సేన కోసం చేయ‌లేద‌ని రాష్ట్రం కోసం చేసాన‌ని తెలిపారు. త‌న ప్ర‌ధాన ల‌క్ష్యం ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌కూడ‌ద‌న్న విష‌యాన్ని మ‌రోసారి ప‌వ‌న్ స్ప‌ష్టం చేసారు.