YS Sharmila: ఇవి ఆత్మహత్యలా? YSRCP చేస్తున్న హత్యలా?
YS Sharmila: ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ. డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్ లో 21 వేల మంది బిడ్డలు చేసుకునేందుకు పనిలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక సర్వే పేర్కొంది. ఇవి నిజంగానే ఆత్మహత్యలా ప్రభుత్వం చేస్తున్న హత్యలా..? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలు సంవత్సరానికి 500 మంది చనిపోతున్నారంటే ఇది నిజంగానే ప్రత్యేక హోదా రాక మనం చేతులారా చేసుకున్న పాపం కాదా..? ఇక్కడి బిడ్డలు వలసలు పోయి యువతే లేని రాష్ట్రంగా తయారవదా..? కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు అంది. కనీసం లక్షమందికైనా ఉద్యోగాలు ఇచ్చారా..? బీజేపీ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర బిడ్డలను మోసం చేసినట్టు కాదా..?
ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు గారు లక్ష 43వేల ఉద్యోగాలు పెండింగ్‌లో పెట్టి దిగిపోయారు. ఆ తర్వాత వచ్చిన జగనన్న గారు 2లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్‌లు ఇచ్చారు? చంద్రబాబు గారిని 7వేల ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నారు అని అడిగి మీరు ఇప్పుడు చేస్తున్నది ఎంటి..? కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తే పాపమా..? SSIUని గత పదిరోజులుగా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ రోజు ఛలో సెక్రెటెరియట్‌కు ఇన్ని ఆంక్షలు ఎందుకు..? ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుందా..? జర్నలిస్టులను గొడ్డులను బాదినట్టు బాదుతున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం? గత రెండు రోజులుగా పోలీసులు హై అలర్ట్ లో ఉండి మమ్మల్ని నియంత్రిస్తున్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము ఆందోళన చేస్తే మీరు నియంత్రియాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నాం. (YS Sharmila)
ALSO READ: YSRCP ఫోటోతో కండోమ్‌ల అమ్మకాలు..!
మీకు భయపడాల్సిన అవసరం ఏముంది..? జర్నలిస్టులను చితకబాదుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారన్నట్టే కదా..? జాబ్ నోటిఫికేషన్ ల వరద పారిస్తామని చెప్పారు జగనన్న గారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా..? 23వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చాక మెగా DSC అన్నారు. 5ఏండ్లు అయ్యింది మీరు అధికారంలోకి వచ్చి ఏం తీసుకువచ్చారు. బాబు పోవాలి జాబ్ రావాలన్న నినాదం మీది కాదా..? దేవుని దయ అన్నారు. దేవుని దయతో అధికారంలోకి వచ్చారు. మరి ఏం చేశారు..? ఒక్క రోజైనా ప్రత్యేక హోదా కోసం పోరాడారా..? ఉద్యోగాలు, పరిశ్రమలు కూడా రాలేదు.
ఒప్పుకున్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సిన అవసరం మీకు లేదా..? ఈ ఐదేళ్లు ఏం చేశారు..? ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు. మెగా DSC అని చెప్పి దగా DSC వేశారు. డీఎస్సీకి కనీసం 150 పుస్తకాలు చదవాలి. గడువు ఉన్నది 26 రోజులు మాత్రమే. మా మీద మానసిక ఒత్తిడి ఉందని ఓ బిడ్డ చెప్పాడు. లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని జగనన్న గారు చెబుతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అందులో ఉన్నాయట.
లక్ష 21వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయంలో వాళ్ల సైన్యం కోసం ఇచ్చుకున్న ఉద్యోగాలు. ఆర్టీసీని విలీనం చేస్తే వచ్చినవి 51వేల ఉద్యోగాలు. 2 లక్షల 30వేల ఉద్యోగాలు ఈ రోజుకీ ఖాళీగానే ఉన్నాయి. 2,557 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు భర్తీ చేశారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గు ఉండాలి. వైయస్ఆర్ గారు మెగా DSC వేసి ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్ఆర్ గారికి జగనన్నకు చాలా తేడా ఉంది. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి.
7వేల ఉద్యోగాలు ఎందుకు వేస్తున్నారని 6వేల ఉద్యోగాలు వేస్తున్నారు. మీకన్నా చంద్రబాబు గారే మేలు కదా..? మాట తప్పము మడమ తిప్పమన్నారు. ఇదేనా వైయస్ఆర్ గారి వారసత్వం అంటే..? నవరత్నాలు, జాతిరత్నాలు ఏమయ్యాయి..? మీరు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో వైట్ పేపర్ విడుదల చేయాలి. జర్నలిస్టులను కొడుతున్నారంటే మీరు భయపడుతున్నారన్న వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. 30 వేల ఉద్యోగాలతో మెగా DSC విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. పోలీసులకు మళ్లీ చెప్తున్నాం మేము చాలా శాంతి యుతంగా సెక్రెటేరియట్‌కి వెళ్లాలనుకుంటున్నాం. వెళ్లనివ్వండి అని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు.