Babar Azam: చరిత్ర సృష్టించిన పాక్ దిగ్గజం.. టీ20ల్లో వరల్డ్ రికార్డు!
Babar Azam: పాకిస్తాన్ మాజీ సారథి, ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (Pakistan Super League)లో పెషావర్ జల్మీ తరఫున కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న బాబర్ ఆజమ్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్లో ఈ బ్యాటర్ పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. పెషావర్ జల్మీ.. (Peshawar Jalmi) కరాచీ కింగ్స్ (Karachi Kings) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భాగంగా బాబర్ ఈ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయంగా పొట్టి క్రికెట్లో ఈ రికార్డు అందుకున్న 13వ బ్యాటర్ కాగా పాకిస్తాన్ నుంచి మాత్రం టీ 20 క్రికెట్లో పదివేల పరుగులు పూర్తిచేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు.
కరాచీ కింగ్స్‌తో గడాఫీ స్టేడియం (Lahore) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు ముందు బాబర్.. 9,994 పరుగులుతో ఉన్నాడు. కానీ కరాచీతో మ్యాచ్‌లో బాబర్.. 51 బంతుల్లోనే 7 బౌండరీలు, 1 సిక్సర్ సాయంతో 72 పరుగులు చేశాడు. అతడు వ్యక్తిగత స్కోరు 6 పరుగులు దాటగానే పదివేల పరుగుల మైలురాయిని దాటాడు. పదివేల పరుగుల మైలురాయికి చేరుకోగానే బాబర్.. క్రిస్‌గేల్, కోహ్లీ, వార్నర్ వంటి దిగ్గజాల రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 (అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు లీగ్‌లు) క్రికెట్లో గేల్.. 285 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా తాజాగా బాబర్.. 271 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. కోహ్లీ (299), వార్నర్ (303), ఫించ్ (327), జోస్ బట్లర్ (350)లు తదుపరి స్థానాల్లో నిలిచారు. (Babar Azam)
అంతర్జాతీయంగా ఈ రికార్డు అందుకున్న 13వ బ్యాటర్‌గా బాబర్ నిలవగా పాకిస్తాన్ నుంచి మాత్రం ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్ అతడే. గతంలో ఈ రికార్డు వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. 42 ఏండ్ల మాలిక్.. 2005 నుంచి నేటి వరకూ 494 ఇన్నింగ్స్‌లలో 13,159 రన్స్ చేశాడు. బాబర్ కంటే ముందు పదివేల పరుగుల క్లబ్లో ఉన్న ఆటగాళ్లలో గేల్, మాలిక్, పొలార్డ్, అలెక్స్ హేల్స్, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, రోహిత్ శర్మ, జోస్ బట్లర్, కొలిన్ మున్రో, విన్స్, డేవిడ్ మిల్లర్లు ఉన్నారు.
మరో 4 రికార్డులు
లాహోర్ మైదానంలో క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్ పెషావర్ జల్మీ మధ్య జరిగింది. పెషావర్ జల్మీకి బాబర్ ఆజం కెప్టెన్. బాబర్ ఆజం 42 బంతుల్లో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయంలో, అతను 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ ఇన్నింగ్స్‌లోనూ 4 రికార్డులు నమోదయ్యాయి. తన పీఎస్ఎల్ ఇన్నింగ్స్‌లో తొలిసారి 4 సిక్సర్లు కొట్టడం తొలి రికార్డుగా నిలిచింది. పీఎస్ఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ బాబర్ కావడం రెండో రికార్డుగా మారింది. ప్రస్తుతం అతని పేరు మీద 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో, అతను PSLలో 3000 ప్లస్ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. దీంతోపాటు పీఎస్ఎల్లో 50 సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా కూడా బాబర్ నిలిచాడు.
అయితే, భారీ రికార్డులు బద్దలు కొట్టే ఇన్నింగ్స్‌లు ఆడిన తర్వాత కూడా, బాబర్ ఆజం తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. బహుశా అతను చివరి వరకు ఆడితే బాగుండేదని అంతా భావించారు. కానీ, ఆజాం ఔట్ అవ్వడంతో పెషావర్ జల్మీ క్వెట్టా గ్లాడియేటర్స్‌పై 16 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.