IPL 2024: కీలక అప్డేట్ వచ్చేసింది..!
IPL 2024: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కీలక అప్డేట్ వచ్చేసింది. IPL 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు లీగ్‌కు సంబంధించిన ప్రారంభం తేదీని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ (Arun Dhumal) వెల్లడించారు. రెండు దశల్లో లీగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సీజన్ మొత్తం భారత్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లీగ్ నిర్వహణ ప్రత్యేకంగా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premiere League) 2024కు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. IPL 17వ సీజన్ ఎప్పటి నుంచి షురూ అవుతుందనే విషయాన్ని లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. ఈ మేరకు మార్చి 22 నుంచి కొత్త సీజన్ ప్రారంభం అవుతుందని ఆయన ప్రకటించారు. ఈ వేసవిలో దేశంలో సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఐపీఎల్ గురించి అధికారిక ప్రకటన చేస్తామని పేర్కొన్నారు.
‘మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌ను స్టార్ట్ చేయాలని మేం ప్లాన్ చేస్తున్నాం. దీనిపై భారత ప్రభుత్వంతో పాటు.. కేంద్ర ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. లీగ్‌కు సంబంధించిన కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ముందుగానే విడుదల చేస్తాం. ఈ సీజన్ మొత్తం భారత్‌లోనే జరుగుతుంది’ అని ధుమాల్ వెల్లడించారు.
ALSO READ: KKR జట్టులో కీలక మార్పు
అరుణ్ ధుమాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈసారి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను రెండు సార్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైతే.. ముందుగానే సుమారు రెండు వారాల మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతా మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా IPL నిర్వహకులు ఇలాగే రెండు సార్లు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఫాలో కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఐపీఎల్‌ను మార్చి 26 నుంచి ప్రారంభించాలని నిర్వహకులు భావించారట. కానీ కేంద్ర ఎన్నికల సంఘం సహా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మార్చి 22 నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. మార్చి 22 నుంచి మే 26 వరకు ఈ సీజన్ కొనసాగుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కాగా 2009 సంవత్సరంలో ఐపీఎల్ సీజన్ మొత్తాన్ని తొలిసారిగా విదేశాల్లో నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ప్లాన్ చేశారు. కానీ ఆ తర్వాత నుంచి ఎన్నికల సమయంలో షెడ్యూల్‌ను కాస్త అటూ ఇటూ మారుస్తూ భారత్‌లోనే లీగ్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
ALSO READ: Ishan Kishan: టార్గెట్ ఇషాన్ కిషన్..!
జూన్ 3 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. దీంతో కనీసం వారం-పది రోజుల ముందుగానే టోర్నీని ముంగిచాలనే ప్లాన్‌లో బీసీసీఐ ఉందట. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏదీ ఏమైనా షెడ్యూల్‌పై పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.