రాజధాని ఏసీ బస్సులో మంటలు.. క్షణాల్లో దగ్దం
టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా మార్గంమధ్యలో ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. మంటలు అంటుకున్నట్లు గుర్తించిన ప్రయాణికులు వెంటనే తేరుకుని బస్సులో నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
ఘటనకు కారణాలు ఇవే..
తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటలోని మొద్దులచెరువులోని ఇందిరా నగర్ వద్దకు వచ్చిన రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు.. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. నడిరోడ్డుపై బస్సు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్-65పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ బస్సు మియాపూర్ డిపోకు చెందినదిగా గుర్తించారు.
స్కూటీపై వెళ్తున్న వ్యక్తి మృతి..
మరోవైపు.. ఈ ప్రమాదంలో ఎవరి తప్పు ఏమో కానీ.. బస్సు స్కూటీపై ఢీకొనడంతో.. స్కూటీ నడుపుతున్న రాజు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అయితే.. మృతుడు రాజుది మునగాల మండలం ఇందిరానగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.