India vs England: రాజ్‌కోట్‌లో టీమిండియా రాజ‌సం

India vs England: రాజ్‌కోట్‌ (Rajkot) టెస్టులో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ పై (England) ఏకంగా 434 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి అయిదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్ జట్టు ముందు భారత జట్టు 556 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 557 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లాండ్‌ 122 పరుగులకే కుప్పకూలింది.

దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. మూడో రోజు ఆటకు అర్ధాంతరంగా దూరమైన అశ్విన్‌ (Ravichandran Ashwin) తిరిగి జట్టులోకి వచ్చి వికెట్‌ సాధించగా… వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ శతకం సాధించి సర్ఫరాజ్‌ ఖాన్‌ సత్తా చాటాడు.

ఓవర్‌ నైట్‌ స్కోరు రెండు పరుగుల నష్టానికి 196 పరుగుల వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 430/4 స్కోరు వద్ద డిక్లేర్డ్‌ చేసింది. భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి (214*: 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్‌లు) ద్విశతకం బాదేశాడు. అతడితో పాటు శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) (91), సర్ఫరాజ్‌ ఖాన్ (Sarfaraj Khan) (68*) హాఫ్‌ సెంచరీలు చేశారు. ఇంగ్లాండ్‌ ఎదుట 557 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజును ప్రారంభించిన భారత్‌ దాదాపు గంటపాటు వికెట్ కోల్పోలేదు. కానీ, కుల్‌దీప్‌తో (Kuldeep) (27) సమన్వయలోపం కారణంగా శుభ్‌మన్‌ గిల్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. (India vs England)

వెన్ను నొప్పి కారణంగా రిటైర్డ్‌ హర్ట్‌ ప్రకటించిన యశస్వి మళ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే దూకుడుగానే ఆడాడు. యశస్వికి తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించిన సర్ఫరాజ్‌ జతకలిశాడు. ఇంగ్లాండ్‌కు ‘బజ్‌బాల్‌’ క్రికెట్ రుచి చూపిస్తూ బౌండరీలతో హోరెత్తించారు. కేవలం 26 ఓవర్లలోనే ఐదో వికెట్‌కు 172 పరుగులు జోడించారు. ఈ క్రమంలో యశస్వి తన కెరీర్‌లో రెండో డబుల్‌ సెంచరీ, సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే రెండో హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఇంగ్లాండ్‌ ఎదుట లక్ష్యం 557 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినట్లు ప్రకటించాడు.

557 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌ జట్టును భారత బౌలర్లు చుట్టేశారు. ఆరంభం నుంచే బ్రిటీష్‌ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. 15 పరుగుల వద్ద ప్రారంభమైన ఇంగ్లాండ్‌ బ్యాటర్ల పతనం వేగంగా కొనసాగింది. ఈ మ్యాచ్‌లో శతకం చేసిన డకెట్‌ను కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ రనౌట్‌ చేశాడు. దీంతో 15 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది.

జాక్‌ ‌క్రాలేను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 18 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం వేగంగా సాగింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ వందలోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. కానీ మార్క్‌ వుడ్‌ 33 పరుగులతో పర్వాలేదనిపించడంతో 122 పరుగులకు బ్రిటీష్‌ జట్టు ఆలౌట్‌ అయింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అయిదు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ పతనాన్ని శాసించాడు. దీంతో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.