ఏప్రిల్ 1 నుంచి టోల్ ఛార్జీల బాదుడు
జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద టోల్ ఛార్జీలను ఏప్రిల్ 1 నుంచి పెంచనున్నట్లు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. సుమారు 5 నుంచి 10 శాతం వరకు పెంచనున్నట్లు పేర్కొంది. దీంతో వాహనదారులపై మరింత భారం పడనుంది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఏ), స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) గణాంకాల ఆధారంగా ఏటా ఏప్రిల్ 1న టోల్ ఛార్జీలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పెంచుతోంది. ఈక్రమంలో ఈ ఏడాది కూడా మరోసారి పెంచనుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం రూ.465 టోల్ చెల్లిస్తున్నారు. శనివారం నుంచి వారు రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.25 పెరిగింది. ఈ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం రూ.310 చెల్లిస్తుండగా ఇకపై రూ.325 చెల్లించాల్సి ఉంటుంది. మినీబస్సులు, లైట్ మోటార్ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం వసూలు చేయనున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, డిండి, యాదాద్రి, వరంగల్, భూపాలపట్నం, నాగ్‌పుర్, పుణె తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారులు ఉన్నాయి. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు పది జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా రహదారులపై తెలంగాణ పరిధిలో 32 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. అదే విధంగా విజయవాడ నుంచి చెన్నై, విజయవాడ నుంచి ఒడిశా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు జాతీయ రహదారి మార్గాలు ఉన్నాయి. ఇటువైపు కూడా వాహన రద్దీ అధికంగానే ఉంటుంది. ఈక్రమంలో టోల్ ఛార్జీలు పెంచడం వాహనదారులపై మరింత భారం వేయడమేనని పలువురు ఆరోపిస్తున్నారు.