Shivaratri కి మహా శివరాత్రికి తేడా ఏంటి?
Shivaratri: మహా శివరాత్రి వచ్చేస్తోంది. ఈ సంవత్సరంలో శివరాత్రి మార్చి 8న వచ్చింది. ఆరోజు శుక్రవారం. శివ భక్తులు శివరాత్రి రోజున ఉపవాసం, జాగారం చేస్తుంటారు. చేయలేని వారు ఉపవాసం వరకు చేసి ఆలయానికి వెళ్లి వస్తుంటారు. ఆరోజున జరిగే లింగోద్భవ దృశ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి. అయితే ఏటా ఒకసారి వచ్చే మహా శివరాత్రి వేరు.. నెల నెలా వచ్చే శివరాత్రి వేరు. అసలు శివరాత్రి అంటే ఏంటి? మహా శివరాత్రికి శివరాత్రికి తేడా ఏంటి? వంటి అంశాలను తెలుసుకుందాం.
ఏటా శివరాత్రులు 12 సార్లు వస్తాయి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో అమావాస్య తిథికి ముందు శివరాత్రి వస్తుంది. కానీ మహా శివరాత్రి ఎంతో ప్రతిష్ఠాత్మకమైనది. ఇది ఏటా ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వస్తుంటుంది. శివరాత్రిని మాస శివరాత్రి అని.. ఏటా వచ్చే దానిని మహా శివరాత్రి అని అంటారు. మాఘ మాసంలో వచ్చే అమావాస్య తిథికి ముందు ఉండే చతుర్ధసి అర్థరాత్రికి ముగిస్తే అది మహా శివరాత్రి అవుతుంది.
ఇవి రెండు రాత్రి సంబంధంగాఉంటాయి. ఎందుకంటే రాత్రి అనేది చీకటికి సంకేతం. అందులోనూ అర్థరాత్రి అంటే కటిక చీకటికి సంకేతం. సనాతన ధర్మంలో ఉపాసన అంతా కూడా రాత్రి పేరుతో ఉంటాయి. దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, మహా శివరాత్రి.. ఇలా ఏది చెప్పినా రాత్రి పూట ఉపాసన అంటాం. కానీ నిజానికి రాత్రి చేసే ఉపాసన ఏమీ ఉండదు. పగటి పూటే భగవంతుడిని ఆరాధిస్తాం. మరి రాత్రి అని ఎందుకంటారు? రాత్రి అన్న మాటకు అర్థం చీకటి. చీకటి అంటే ఏ వస్తువు ఏదో తెలీనటువంటి స్థితిలో ఉంది అని. ఏదీ సత్యమో తెలీనప్పుడు భయమేస్తుంది. భయం మృత్యువుకు పర్యాయ పదం. ఎక్కడ భయం ఉందో అక్కడ మృత్యువు ఉంటుంది.
భయం లేని స్థితికి చేరతాడో అప్పుడే మృత్యువును దాటిపోయాడు. అమృతత్వాన్ని పొందాడు అని గుర్తు. ఎప్పుడు భయం పోతుంది? రెండో వస్తువు లేదు అని తెలుసుకుంటే భయం పోతుంది. నేను కాక ఇంకొటి కూడా ఉంటే అది నన్ను ఏమన్నా చేస్తుందేమో అన్న భయం ఉంటుంది. ఇవాళ బాగుంది కానీ రేపు ఏం చేస్తుందో అని భయం. కానీ ఉన్నది నేనొక్కటే రెండోది ఏమీ లేదు అని తెలిసిననాడు భయం వేయదు. ఆ జ్ఞానం అనుభవంగా రావాలి. దానిని అద్వైతానుభూతి అంటారు.
రాత్రి అన్న మాట ఉపాసనలో అర్థమేమి అంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగడం. అందుకే సంవత్సరం మొత్తం మీద అర్థరాత్రి వేళ భగవంతుని స్వరూపం ఆవిర్భవించేటువంటి తిథులు రెండు వస్తాయి. ఒకటి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాటి అర్థరాత్రి వేళ కృష్ణ భగవానుడి అవతార స్వీకరం. ఎందుకు ఆయన శ్రావణ మాసంలోనే పుట్టారు? ఎందుకంటే శ్రావణ మాసం దక్షిణాయణంలో వస్తుంది. దక్షిణాయణం దేవతలు అందరికీ కూడా రాత్రి. అలాగే.. బహుళ పక్షం పితృదేవతలకు రాత్రి.
శ్రావణ మాసం నల్లటి మబ్బులతో ఉంటుంది కాబట్టి ప్రకృతి పరంగా రాత్రి. కాబట్టి అందరికీ రాత్రే..! అర్థరాత్రి ఆ అజ్ఞానావస్థలో సమస్త లోకాలు ఉన్నప్పుడు ప్రస్థాన త్రయంలో ఒకటైన భగవద్గీతను తాను జగద్గురువై జ్ఞానబోధ చేయడానికి వెలుగులా ముగ్ధగా అర్థరాత్రి వేళ ఆవిర్భవించాడు. అక్కడి నుంచి కచ్చితంగా ఆరు నెలలు లెక్కపెడితే.. శ్రావణ మాసంలో బహుళ పక్షంలో కృష్ణాష్టమి వస్తుంది. శ్రావణ మాసం తర్వాత శ్రావణం, బాధ్రపథం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం.. మళ్లీ ఆరు నెలలు వచ్చేటప్పటికి బహుళ పక్షంలో అమావాస్య తిథికి ఉండే చతుర్ధసి అర్థరాత్రి వేళ లింగోద్భవం అవుతుంది. అంటే జ్యోతిర్లింగం పుడుతుంది. దానినే మహా శివరాత్రి అంటారు.