Poonam Pandey: “చ‌చ్చింది” గొర్రె..!

Poonam Pandey: ఐటెం గ‌ర్ల్‌గా పేరొందిన పూన‌మ్ పాండే త‌న‌పై తానే చ‌నిపోయిన‌ట్లు ప్ర‌చారం చేయించుకుని చేసిన ర‌చ్చ‌కు యావ‌త్ భార‌త‌దేశం ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. చావంటే చిన్న చూపు అయిపోయింద‌ని.. ఇలాంటి ప్రాంక్స్ చేసే వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పూన‌మ్ పాండేపై రూ.100 కోట్ల దావా న‌మోదైంది.

పూన‌మ్ పాండే… ఈమె గురించి తెలీని వారు ఎవ్వ‌రూ ఉండ‌రు. ఏది ప‌డితే అది వాగుతూ.. ప్రాంక్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్ అవ్వాల‌ని చూస్తూ ఉంటుంది. 2011లో ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇండియా గెలిస్తే టీవీ ముందు న‌గ్నంగా స్ట్రిప్ చేస్తాన‌ని ప్ర‌క‌టించింది. ఆమె అనౌన్స్‌మెంట్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ త‌ర్వాత 2011లో మ‌హేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా ప్ర‌పంచ క‌ప్ సాధించింది. అయితే పూన‌మ్ పాండే మాత్రం చెప్పింది చేయ‌లేద‌నుకోండి.

ఆ త‌ర్వాత త‌న‌కు న‌చ్చిన వ‌చ్చిన ప‌నులు చేసుకుంటూ బాలీవుడ్‌లో ఏవైనా పార్టీలు అవి ఉంటే అటెండ్ అవుతూ త‌న ప‌ని తాను చేసుకుంటూ ఉండిపోయింది. అలాంటి పూన‌మ్ ఉన్న‌ట్టుండి చ‌నిపోయింద‌ని వారం రోజుల క్రితం షాకింగ్ వార్త బ‌య‌టికి వచ్చింది. ఇది దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. పైగా ఆమె చ‌నిపోవ‌డానికి కార‌ణం గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ (Cervical Cancer) అని పూన‌మ్ టీం సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది.

కొంత‌కాలంగా పూన‌మ్ పాండే స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ (గ‌ర్భ‌కోశ క్యాన్స‌ర్)తో బాధ‌ప‌డుతున్నార‌ని.. ఆమె గ‌త‌ గురువారం రాత్రి త‌న స్వ‌స్థ‌లం అయిన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో క‌న్నుమూసార‌ని మేనేజ‌ర్ ప్ర‌క‌టించారు. అయితే పూన‌మ్ చ‌నిపోయిన‌ట్లు ఆమె కుటుంబ స‌భ్యుల నుంచి తెలిసింది కానీ అందులో ఎంత వాస్త‌వం ఉంద‌నేది కూడా తెలియాల్సి ఉంద‌ని అన్నారు.

అయితే క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న పూన‌మ్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోలు, వీడియోలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నార‌ని ఎప్పుడూ కూడా ఆమె క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు అనిపించ‌లేద‌ని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టారు. పైగా నాలుగు రోజుల క్రితం గోవాలో తెగ ఎంజాయ్ చేసిన పూన‌మ్ ఉన్న‌ట్టుండి క్యాన్స‌ర్‌తో చ‌నిపోయారంటే ఎలా న‌మ్మాలి అని ప్ర‌శ్నించారు. పూన‌మ్ విష‌యంలో ఏదో అనుమానం ఉంద‌ని.. గ‌ర్భకోశ క్యాన్స‌ర్ ఉన్న‌వారు హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌రని.. ఒక‌వేళ పూన‌మ్ మ‌ర‌ణ వార్త నిజ‌మే అయితే ఈ అంశంలో పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌ర‌గాల్సిందే అని డిమాండ్ కూడా చేసారు.

పూన‌మ్ చ‌నిపోయింద‌ని తెలిసి చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా సోష‌ల్ మీడియా ద్వారా సంతాపం ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత పూన‌మ్ ఉన్న‌ట్టుండి నేను బ‌తికే ఉన్నా అంటూ ఓ వీడియో రిలీజ్ చేసారు. గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోస‌మే తాను ఇలా చ‌నిపోయిన‌ట్లు నాట‌కం ఆడాల్సి వ‌చ్చింద‌ని అన్నారు. తాను ఇలా చ‌నిపోయిన‌ట్లు ప్ర‌క‌టించ‌క‌పోయి ఉంటే ఎవ్వ‌రూ కూడా గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ అంశాన్ని సీరియ‌స్‌గా తీసుకోర‌ని తాను చేసిన వెధ‌వ ప‌నిని స‌మ‌ర్ధించుకున్నారు.

ఏదేమైనా పూన‌మ్ చేసిన ప‌ని అర్థవంతంగా లేద‌ని.. ఇలాంటి వారిపై క‌ఠిన చర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ ఆల్ ఇండియా సినీ వ‌ర్క‌ర్స్ అసోసియేష‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇలాంటి ప్రాంక్ చేసినందుకు గానూ రూ.100 కోట్లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.