Hyderabad: ఏపీ రాజ‌ధానిగా హైద‌రాబాద్.. సాధ్య‌మేనా?

Hyderabad: ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉన్న‌ప్పుడు రాజ‌ధానిగా హైద‌రాబాద్ (Hyderabad) ఉంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణ (Telangana) రాజ‌ధానిగా మాత్ర‌మే హైద‌రాబాద్ ఉండిపోయింది కానీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు (Andhra Pradesh) మాత్రం రాజ‌ధాని లేకుండా పోయింది. అప్ప‌టికే ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) అమ‌రావ‌తిని (Amaravati) రాజ‌ధానిగా ప్ర‌క‌టించి అక్క‌డ అభివృద్ధి పనులు కూడా మొద‌లుపెట్టేసారు. కానీ 2019 ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ఓడిపోయి YSRCP పార్టీ అధికారంలోకి రావ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (Jagan Mohan Reddy) అధిష్టానం ఎక్కారు. ఆ త‌ర్వాత ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ అమ‌రావ‌తిని రాజ‌ధానిని చేయడానికి జ‌గ‌న్ ఒప్పుకోలేదు.

కొంత‌కాలం పాటు విశాఖ‌ప‌ట్నం రాజ‌ధానిగా చేస్తానని జ‌గ‌న్ ప‌ట్టుబ‌ట్టి కూర్చున్నారు. కార్య‌క‌లాపాల‌న్నీ వైజాగ్‌కే షిఫ్ట్ చేస్తామ‌ని కూడా ప్ర‌క‌టించారు. కానీ కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తే ఉంటుంది అన‌డంతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి (Bharati Janata Party) భ‌య‌ప‌డి జ‌గ‌న్ కూడా ఏమీ అన‌లేక మౌనంగా ఉండిపోయారు. అలాగ‌ని ఆయ‌న త‌న ప‌ట్టు వీడి అమ‌రావ‌తిని రాజ‌ధాని అని ప్ర‌క‌టించారా అంటే అదే లేదు. అయితే ఇప్పుడు YSRCP నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు. ఇంకా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని ఏదో తేల‌లేదు కాబ‌ట్టి.. రాజ‌ధాని ఏంటో తేలేవ‌ర‌కు హైద‌రాబాద్‌నే రాజ‌ధానిగా ఉంచాల‌ని వైవీ సుబ్బారెడ్డి షాకింగ్ కామెంట్ చేసారు.

విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో రాజ్య సభలోనూ దీనిపై చర్చిస్తామని ఆయ‌న ప్ర‌క‌ట‌న చేసారు. గ‌తంలో  YCP మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ (Botcha Satyanarayana) కూడా ఇదే పాట పాడారు. 2024 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంటుంద‌ని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రిక‌గ్నిష‌న్ యాక్ట్ కింద 2024 వ‌ర‌కు తెలంగాణ‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా రాజ‌ధాని హైద‌రాబాదేన‌ని తెలిపారు. చంద్ర‌బాబు నాయుడు సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఐదు కోట్ల ప్ర‌జ‌ల అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించేసార‌ని ఆనాడు బోత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోపించారు.

మ‌రోప‌క్క ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా మ‌రో 30 ఏళ్లు హైద‌రాబాదే ఉండాల‌ని APVJAC అధ్య‌క్షుడు రాయ‌పాటి జ‌గ‌దీష్ గ‌తంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి (Narendra Modi) లేఖ రాసారు. 2024 నాటికి కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని గొడ‌వ తీరేది కాద‌ని ఆ త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌ల్లి లేని బిడ్డ‌గా అనాథ‌లా మారిపోతుందని జ‌గ‌దీష్ అభిప్రాయ‌ప‌డ్డారు. 2024 రానే వ‌చ్చింది. ఈ డిసెంబ‌ర్ వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా హైద‌రాబాద్ ఉంటుంది. రెండు నెల‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు (AP Elections) రానున్నాయి. ఆ త‌ర్వాత ఎవ‌రి ప్ర‌భుత్వం ఏర్పాటు అవుతుంది అన్న దానిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ఏ ప్రాంతం ఉండబోతోందో తెలుస్తుంది. ఒక‌వేళ తెలుగు దేశం, జ‌న‌సేన పార్టీలు (Janasena) క‌లిసి అధికారంలోకి వ‌స్తే రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ప్ర‌క‌టిస్తారు. మ‌ళ్లీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌స్తే మాత్రం క‌చ్చితంగా విశాఖ‌ప‌ట్నాన్ని రాజ‌ధానిగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.