Nara Lokesh: వారిని అలా అనేస్తే ఎలా లోకేష్ బాబూ…!?

Nara Lokesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు (AP Elections) ద‌గ్గ‌రప‌డుతున్న నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేత‌లు ప్ర‌చార జోరును పెంచారు. నారా లోకేష్ (Nara Lokesh) స్థానిక నేత‌ల‌తో క‌లిసి వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌హిరంగ స‌భ‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. స‌భ అన‌గానే ఎవరైనా ప్ర‌తిప‌క్ష నేత‌పైనే ఆరోప‌ణ‌లు చేస్తూ వారు చేసిన త‌ప్పులు, అవినీతులు ఇవే అని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడేస్తుంటారు. అయితే.. ఈ మ‌ధ్య‌కాలంలో లోకేష్ త‌న ప్ర‌సంగ స్టైల్‌ను కాస్త మార్చినట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఈరోజు నారా లోకేష్ ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. స్థానిక నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, బూత్ లెవెల్ నేత‌లు వారిని ఉద్దేశిస్తూ ఓ మాట‌న్నారు. పార్టీ కోసం నిరంత‌రం కృషి చేస్తూ పార్టీ గెలుపు కోస‌మే ప్ర‌తిక్ష‌ణం క‌ష్ట‌ప‌డే వారికే త‌న మొద‌టి ప్రాధాన్య‌త ఉంటుంద‌ని.. అది మానేసి ఊరికే త‌న చుట్టూ త‌న కార్యాల‌యం చుట్టూ తిరిగే వారిని ప‌ట్టించుకోన‌ని అన్నారు. ఇలాంటి మాట‌లు మాట్లాడే ముందు లోకేష్ కాస్త ఆలోచించుకుని ఉండాల్సింది అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఎన్నిక‌ల్లో గెలిచేసిన త‌ర్వాత ఎన్ని అన్నా పెద్దగా ఫ‌రక్ ప‌డ‌దు కానీ స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు ఇలాంటి మాట‌లు మాట్లాడితే అవి బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది.

ఊరికే కార్యాల‌యాల చుట్టూ నా చుట్టూ తిరిగితే స‌రిపోదు.. ఇలా మాట్లాడితే కార్య‌క‌ర్త‌లు, నేత‌లకు బాధ‌గా ఉంటుంది. ఎవ‌ర్ని అంటున్నారో తెలీక న‌న్నేనా న‌న్నేనా అనుకుని వారు మ‌ద‌న ప‌డిపోతుంటారు. ఎవ్వ‌రూ కూడా స్వ‌లాభం లేకుండా ప‌నిచేయ‌రు. ఇది లోక‌మెరిగిన నిజం. అలాగని కొన్ని నిజాల‌ను నేరుగా ప్ర‌జ‌ల ముందు బ‌హిర్గతం చేస్తే ఫ‌లితాలు మ‌రోలా ఉంటాయ‌ని లోకేష్ ఇప్ప‌టికైనా తెలుసుకోవాలి. రాజ‌కీయ నాయ‌కుడు అంటే త‌న సైన్యాన్ని ముందుండి న‌డిపించాలి. ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు పాల‌న అంటే ఏంటో తెలియ‌జేద్దాం.. ఇందుకోసం మీ అవ‌స‌రం మాకుంది. మీ సాయం మాకు కావాలి. మీరు లేనిది పార్టీ లేదు.. ఇలాంటి కాస్త హై వోల్టేజ్ ఉన్న డైలాగులు విసిరితే పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో కూడా కాస్త ఊపు వ‌స్తుంది. అది మానేసి నా చుట్టూ తిరిగితే స‌రిపోదు అని లోకేష్ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల ఆల్రెడీ కొంద‌రు కార్య‌క‌ర్త‌లు హ‌ర్ట్ అయ్యారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) కూడా ఎప్పుడూ త‌న ప్ర‌సంగాల్లో జ‌న‌సైనికులు, జ‌న‌సేన వీర మ‌హిళ‌ల‌ను ఇలా త‌క్కువ చేసిన‌ట్లు మాట్లాడ‌లేదు. వారికి ఏమ‌న్నా స‌ల‌హాలు సూచ‌న‌లు చేయాల‌నుకుంటే స‌ప‌రేట్ మీటింగ్ పెట్టి చేసుకుంటారు కానీ స‌భ‌ల్లో ప్ర‌జ‌ల ముందు ఎప్పుడూ ఇలా నా చుట్టూ తిరిగితే స‌రిపోదు అని అన‌లేదు. ఇన్నేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా ఇంకా మాట్లాడటం చేత కాక‌పోతే ఇక ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌సంగాల‌ను ఎలా అర్థంచేసుకుంటారు..? త్వ‌ర‌లో ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికైనా లోకేష్ ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ కోసం పనిచేసే కార్య‌క‌ర్త‌ల‌ను త‌క్కువ చేసి చూడ‌టం.. వారు స్వలాభం కోసం త‌న చుట్టూ త‌న కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నారు అని ఆరోపించ‌డం మానేస్తే బాగుంటుంది.