Telangana: TSRTC గుడ్ న్యూస్

Telangana: మహాలక్ష్మి పథకం అమలు వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ ఏడాది జూన్‌ నాటికి 1325 బస్సులను దశలవారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్‌ చేసింది. అందులో 712 పల్లె వెలుగు, 400 ఎక్స్‌ ప్రెస్‌, 75 డీలక్స్‌, 138 లహరి/రాజధాని బస్సులున్నాయి. వాటిలో ఇప్పటికే కొన్ని బస్సులను వాడకంలోకి తెచ్చిన సంస్థ.. తాజాగా మరో 100 బస్సులను ప్రారంభించబోతుంది.

అందుబాటులోకి మరో 100 కొత్త బస్సులు

మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్ ప్రెస్ బస్సులు

హైదరాబాద్‌-శ్రీశైలం రూట్‌లో తొలిసారిగా 10 ఏసీ రాజధాని సర్వీసులు

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం

హైదరాబాద్‌ ఎన్టీఆర్ మార్గ్‌లోని డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాం వద్ద శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రవాణా, BC సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గారితో పాటు టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

కొత్తగా అందుబాటులోకి వస్తోన్న ఈ 100 బస్సుల్లో.. 90 ఎక్స్ ప్రెస్ బస్సులున్నాయి. ఇవి మహాలక్ష్మి- ఉచిత బస్సు ప్రయాణ స్కీంకు ఉపయోగపడనున్నాయి. అలాగే, శ్రీశైలం ఘాట్‌ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెడుతోంది. 11 మీటర్ల పొడువుగల ఈ ఏసీ బస్సుల్లో.. 36 సీట్ల సామర్థ్యం ఉంటుంది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్‌ సైట్‌ wwww.tsrtconline.in ద్వారా సీట్లను ముందస్తు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు.

మ‌హాలక్ష్మి ప‌థ‌కంలో భాగంగా అమ‌లు చేసిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం చాలా మందికి ఊర‌ట క‌లిగించిన‌ప్ప‌టికీ కొత్త స‌మ‌స్య‌ల‌ను కూడా తెచ్చిపెట్టింది. ఎప్పుడూ లేని విధంగా ఆడ‌వారు బ‌స్సులో విప‌రీతంగా ప్ర‌యాణిస్తుండ‌డం.. దాని వ‌ల్ల మ‌గ‌వారికి సీట్లు లేక‌పోవ‌డం ఇబ్బందుల‌ను క‌లిగించింది. పురుషులు టికెట్ కొన్నా కూడా సీట్లు లేక‌పోవ‌డం.. మ‌హిళ‌లు ఎక్క‌వైపోవ‌డంతో జాగా లేక మ‌ధ్య‌లోను బ‌స్సు దిగిపోయిన ఘ‌ట‌న‌లు చాలా జ‌రిగాయి. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డారు.

దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం పురుషుల స్పెష‌ల్ పేరిట వారికోసం అని ప్ర‌త్యేక బ‌స్సులు వేయించింది. దీని ద్వారా కాస్త ఊర‌ట క‌లిగిందనే చెప్పాలి. ఇక ఈ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం వ‌ల్ల ఆదాయం ప‌డిపోయింద‌నే చెప్పాలి. ఇది ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌నుంద‌ని ముందు నుంచీ BRS పార్టీ మొత్తుకుంటూనే ఉంది. ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌కుండా ఉండేలా బడ్జెట్ ప్ర‌ణాళిక‌లు రూపొందించాం అని కాంగ్రెస్ అంటోంది. ఏ ర‌క‌మైన ప్ర‌ణాళిక‌లు వేసారు ముందు ముందు అర్థ‌మ‌వుతుంది.

మ‌రోప‌క్క బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా తెలంగాణ‌కు చెందిన ఆటో డ్రైవ‌ర్లు ధ‌ర్నాలు చేప‌డుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌లో దాదాపు 25 మంది డ్రైవ‌ర్లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. ఉచిత ప్ర‌యాణం వ‌ల్ల తమ‌కు గిరాకీ లేకుండాపోతోంద‌ని.. అప్పు చేసి మ‌రీ ఆటో కొని బ‌తుకు తెరువు కోసం న‌డుపుతుంటే దానిని కూడా లాగేసుకున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద ఓ ఆటో డ్రైవ‌ర్ త‌న ఆటోకి నిప్పు అంటించి ధ‌ర్నాకు దిగ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆటో డ్రైవ‌ర్ల‌కు అన్యాయం జ‌ర‌గితే ఊరుకోం అంటూ పార్టీ నేత‌లు ఆటోల్లో అసెంబ్లీకి వెళ్తున్నారు. ఇటీవ‌ల BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆటోలో ప్ర‌యాణించ‌గా.. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఆటోలో అసెంబ్లీకి వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.