PV Narasimha Rao: అందుకే కాంగ్రెస్ నరసింహారావుని దూరం పెట్టిందా?
PV Narasimha Rao: దివంగత ప్రధాని వీపీ నరసింహారావుకు (PV Narasimha Rao) కేంద్ర ప్రభుత్వం భారత రత్న (Bharat Ratna) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ భారత రత్న ఇస్తే.. పార్టీలో గొడ్డు చాకిరీ చేయించుకుని కనీసం భౌతికకాయాన్ని కూడా పార్టీ కార్యాలయంలో పెట్టనివ్వని కాంగ్రెస్ పార్టీపై ఇప్పుడు నరసింహారావు అభిమానులు, ఇతర పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. నరసింహారావు రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. ఆయన రాజకీయాలు వదిలేయానుకుంటున్న సమయంలోనే అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) దుర్మరణం చెందడం.. ఆ తర్వాత ఆ స్థానాన్ని సోనియా గాంధీ (Sonia Gandhi) నరసింహారావుకి ఇవ్వాలని అనుకోవడం జరిగిపోయాయి.
ఆ తర్వాత దేశంలో పలు ఆర్ధిక సవరణలను ప్రవేశపెట్టి అప్పుడ ఊబిలో కూరుకుపోతూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న భారతదేశాన్ని నిశ్శబద్ధంగా పైకి తీసుకొచ్చారు. అయితే నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యాక కొన్నేళ్ల పాటు కాంగ్రెస్ హైకమాండ్ బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ నరసింహారావుని పిలిచేవారు. కాంగ్రెస్ పార్టీ పోస్టర్లపై ముక్కూ మొహం తెలీని వారి ఫోటోలు కూడా ఉండేవి కానీ నరసింహారావు ఫోటో మాత్రం కనిపించేది కాదు.
దాంతో ఆయన కూడా లోలోపల కుంగిపోయారు. ఆ తర్వాత సోనియా గాంధీ నరసింహారావు పట్ల ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో బయటపడింది. రాజీవ్ గాంధీని చంపేసినప్పుడు ఈ హత్య ఎవరు ఎందుకు చేసారు వంటి అంశాలను క్షుణ్ణంగా విచారణ జరిపించడంలో నరసింహారావు ఫెయిల్ అయ్యారని.. ఒక రాజకీయనేత హత్యకు గురైతేనే విచారణ ఇంత ఆలస్యం అవుతుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఓసారి సోనియా వార్నింగ్ ఇస్తూ నరసింహారావుకు లేఖ రాసిందట.
ఇదే విషయంలో సోనియా గాంధీకి నరసింహారావుపై ఆగ్రహం పెరిగింది. అందుకే ఆయన చనిపోయినప్పుడు భౌతికకాయాన్ని కాంగ్రెస్ భవన్‌లోకి కూడా రానివ్వలేదు. ఆయన శవపేటికను పెట్టడానికి స్థలం సరిపోదని అందుకే గేట్ వద్దే పెట్టాల్సి వచ్చిందని సాకులు చెప్పింది. కానీ కాంగ్రెస్ భవన్ భవంతి చూసినవారికి తెలుస్తుంది అక్కడ ఎంత మంది నిలబడే జాగా ఉందోనని. మనిషి చనిపోయాక కూడా కనీసం జాలి కనికరం చూపించని కాంగ్రెస్ పార్టీ కోసమా తన తండ్రి ఇంతకాలం పనిచేసింది అని నరసింహారావు బిడ్డలు కూడా కుమిలిపోయారు.
మరో కీలక అంశం ఏంటంటే.. ఆ సమయంలో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి నరసింహారావు భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వెళ్లినప్పుడు నరసింహారావు బిడ్డలను పరామర్శించారు. ఆ సమయంలో ఇక్కడ (ఢిల్లీ) అంత్యక్రియలు వద్దమ్మా.. హైదరాబాద్‌లో చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఒప్పించారట. అలా ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లోనే నిర్వహించారు.
సోనియా గాంధీ వచ్చి ఈ మాట చెప్తే బాగోదు కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా చెప్పించి నరసింహారావు కుటుంబీకుల్ని ఒప్పించేలా చేసారు. అలాంటి నరసింహారావుకు ఈరోజు భారతరత్న వస్తే సోనియా గాంధీ ఎలా స్పందిస్తారా అని చాలా మంది ఎంతో ఎదురుచూసారు. సోనియా మాత్రం చాలా స్మార్ట్‌గా సమాధానం ఇచ్చారు. తమ పార్టీలో పనిచేసిన వ్యక్తికి కేంద్రం భారతరత్న ఇస్తే తానెందుకు సంతోషించను అని ఎవరో ఏదో అనేస్తారేమో అని ముందుగానే ఊహించి కామెంట్ చేసినట్లు ట్వీట్ చేసారు.