‘RRR తమిళ సినిమా’
RRR.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చిత్రం. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ బెస్ట్ స్కోర్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తెలుగులో తెరకెక్కినా భారతదేశంతోపాటు విదేశాల్లోనూ వివిధ భాషల్లో విడుదలై రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా వారికి జోడీగా ఆలియా భట్, ఒలీవియా నటించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక, ఆస్కార్ అవార్డు దక్కడం, విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్ కావడంతో అన్ని సినీ పరిశ్రమల చూపు ఆర్‌ఆర్‌ఆర్‌పై పడింది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా గురించి చర్చ నడిచింది. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తాజాగా ప్రియాంక పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాలీవుడ్ సినిమా అని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి వ్యాఖ్యానించారు. దానికి సమాధానంగా ప్రియాంక ఆర్‌ఆర్‌ఆర్ బాలీవుడ్ సినిమా కాదని చెప్పారు. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ, ఆర్‌ఆర్‌ఆర్ తమిళ సినిమా అని చెప్పింది ప్రియాంక. దీంతో అది తెలుగు సినిమా అని కూడా తెలీదా అంటూ ప్రియాంకను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
రాంచరణ్ హీరోగా తెరకెక్కిన తుఫాన్ సినిమాలో హీరోయిన్‌గా చేశారు ప్రియాంక. అంతేకాదు, ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో చరణ్, ఉపాసనలను కలిశారు కూడా. రాంచరణ్‌ను కలిసిన తర్వాత కూడా ఆర్‌ఆర్‌ఆర్ తెలుగు సినిమా అని తెలియలేదా ప్రియాంకా అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ను తమిళ సినిమా అంటూ టాలీవుడ్ ఆడియన్స్ మనోభావాలను ప్రియాంక చోప్రా దెబ్బతీశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఆస్కార్ గెలిచినప్పటికీ విదేశీయులు అదో తెలుగు చిత్రమని గుర్తించడం అంత ఈజీ కాదు. ఏ భాషా చిత్రం అనే విషయాన్ని పక్కన పెడితే, విదేశీయులకు ఆర్‌ఆర్‌ఆర్ అంటే బాలీవుడ్ మూవీ. తెలుగు సినిమా పూర్తి స్థాయిలో ప్రపంచ గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా తప్పు చెప్పడం విచారించాల్సిన విషయం.
అమెరికాలో ప్రియాంక చోప్రా ‘ఆర్మ్ ఛైర్ ఎక్స్పర్ట్ విత్ డాక్స్ షెపర్డ్’ అనే పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హోస్ట్ డాక్స్ షెపర్డ్ తెచ్చిన ప్రస్తావనలో ఇదంతా జరిగింది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా బాలీవుడ్ సినిమా అని చెప్పడం తప్పైతే కాదు, కానీ అది తమిళ చిత్రమని చెప్పి ఆమె మరింతగా బాధపెట్టారని తెలుగు ఆడియన్స్ ఫీలవుతున్నారు. తమిళ ఆడియన్స్ కూడా ఈ విషయంలో ప్రియాంక చోప్రా మీద మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఇరవై ఏళ్లపాటు సినిమాలు చేసిన ప్రియాంక చోప్రాకు తెలుగు, తమిళ చిత్రాల మధ్య తేడా తెలియకపోవడం దారుణం అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి!