Pawan Kalyan: ఇదిగో చెక్కు.. మరి నా టికెట్?
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ కొందరి పట్ల కోపంగా ఉన్నారు. పవన్‌పై అభిమానంతో కొందరు ప్రముఖులు జనసేన పార్టీకి విరాళంగా చెక్కులు పంపి… దానికి బదులు సీట్లు కావాలని అడుగుతున్నారట. అలా సీట్లు అడిగుతున్నవారికి వారు పంపిన చెక్కులను తిరిగి పంపించేయాలని జనసేన నేతలను ఆదేశించారు. పవన్ కళ్యాణ్‌పై అభిమానుంతో లక్షల్లో, కోట్లల్లో చెక్కులను ఆయనకు పంపుతున్నారు. చెక్కులు అందాయని తెలీగానే మధ్యవర్తులతో ఫలానా సీటు కావాలని డిమాండ్ చేస్తున్నారట. (pawan kalyan)
పార్టీల కోసం కష్టపడి పనిచేసే నేతలకే సీట్లు, టికెట్లు ఇస్తానని.. అంతేకానీ ఇలా చెక్కులు ఇచ్చి పార్టీకి ఏదో చేసేసాం అనుకునేవారికి సీట్లు ఇస్తానని అస్సలు అనుకోవద్దని పవన్ గట్టిగా తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో YCP, తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీలు చేపట్టిన సర్వేలను బట్టి చాలా మంది నేతలు అటు ఇటు జంప్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఎవరైతే YCP నేతలు పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరాలనుకుంటున్నారో వారు పవన్ కళ్యాణ్‌ను కలిసి పార్టీ ఫండ్ అన్నట్లుగా చెక్కులు ఇచ్చి వస్తున్నారు. ఆ తర్వాత ఫలానా సీటు కావాలని మధ్యవర్తులతో చెప్పి పవన్ వద్దకు పంపుతున్నారు. ఈ విషయం తెలిసి పవన్ ఆగ్రహానికి గురయ్యారు. చెక్కులు ఇచ్చి సీట్లు ఆశిస్తే నిరాశ తప్ప ఏమీ మిగలదని మర్యాదపూర్వకంగా చెప్పి పంపించారు. చెక్కులు వెనక్కి పంపించేసాక పవన్ తన కార్యకర్తల ద్వారా వారికి ఫోన్లు చేయించి మీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు.. కానీ మీ సాయం మాకు అవసరం లేదు అని చెప్పించారట.
ఈ మధ్యకాలంలో దాదాపు ఏడుగురు నేతలు జనసేనకు చెక్కులు పంపి టికెట్లు ఆశించారట. ఆ చెక్కులను పవన్ రిజెక్ట్ చేసారు. విశాఖ, ఉమ్మడి గోదావరి, ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన నేతలే ఇలా చెక్కులు ఇచ్చి టికెట్ ఆశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలు, నేతలను పిలిపించి ఒక మాట చెప్పారట.
తనను డబ్బులతో కొనాలి అనుకుంటే అది సాధ్యం కాని పని అని.. తనకు వచ్చే విరాళాలు పార్టీని నడిపించడానికి మాత్రమే వాడుతున్నానని.. సొంత ఖర్చులకు అస్సలు పెట్టుకోవడంలేదని స్పష్టం చేసారట. ఇలా కావాలని పార్టీకి డొనేషన్ ఇస్తున్నామని చెప్పి టికెట్ ఆశిస్తే మాత్రం తాను ఒప్పుకునేది లేదని.. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి తనపై నమ్మకంతో మొదటి నుంచి తనకు తోడుగా ఉన్నవరికే ప్రాధాన్యత ఇస్తానని.. ఆ తర్వాత మిగిలిన వారి గురించి ఆలోచిస్తానని తేల్చి చెప్పేసారు. (pawan kalyan)
దాంతో YCP టికెట్ రాక కనీసం జనసేన టికెట్ ఆశిస్తున్న నేతలకు చుక్కెదురైంది. టికెట్ ఇస్తే చాలు రా బాబూ ఏ పార్టీ అయితే ఏంటి అనుకుంటున్న నేతలు చాలా మంది ఉన్నారు. వారికి ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురైంది. ఉన్న పార్టీలో ఉండలేక.. పక్క పార్టీకి వెళ్లలేక సతమతమవుతున్నారు. ప్రతి జనసేన కార్యకర్తపై తనకు అవగాహన ఉందని.. తనకు తెలీకుండా తన పార్టీలో చాలా జరుగుతున్నాయని ఎవ్వరూ అనుకోవద్దని పవన్ అన్నారు.
ఎవరు తనతో పాటు ఉంటున్నారు.. ఎవరు కేవలం సీట్లను ఆశించి ఉంటున్నారు అనే విషయం తెలుసని సమయం వచ్చినప్పుడు వారంతట వారే బయటపడతారని పవన్ చాలా సభల్లో తెలిపారు. పవన్ కళ్యాణ్ నిర్ణయం పట్ల చాలా మంది జనసేన నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు డబ్బులకు అమ్ముడుపోకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని.. ఇలాంటి నేతకు మద్దతుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. (pawan kalyan)