Joke చెప్పిన త‌ల్లి.. ఐదేళ్ల కోమా నుంచి బ‌య‌ట‌ప‌డిన కూతురు

Joke: ఒక జోక్ ఎంత సీరియ‌స్‌గా, బాధ‌గా ఉన్న‌వాడినైనా న‌వ్విస్తుంది అని తెలుసు కానీ… ఐదేళ్ల నుంచి కోమాలో ఉన్న‌వారిని కూడా కాపాడుతుంద‌ని అనుకోలేదు. ఈ ఘ‌ట‌న అమెరికాలో చోటుచేసుకుంది. మిచిగ‌న్‌కు చెందిన జెన్నిఫ‌ర్ అనే అమ్మాయికి 2017లో కారు ప్ర‌మాదం జ‌రిగింది. దాంతో ఆమె దాదాపు ఐదేళ్ల నుంచి ఇర్రివ‌ర్సిబుల్ కోమాలోకి వెళ్లిపోయింది. అస‌లు త‌న కూతురు తిరిగి బ‌తుకుంతుందో లేదో అని ఆశ‌లు వ‌దిలేసుకుంటున్న స‌మ‌యంలో ఆమె తల్లి చేసిన చిన్న జోక్ వ‌ల్ల ఐదేళ్ల కోమా నుంచి బ‌య‌ట ప‌డింది. అది చూసి డాక్ట‌ర్లు కూడా షాక‌య్యారు.

అయితే ఆమె ఏ జోక్ చెప్పింది అనే అంశాన్ని మాత్రం జెన్నిఫ‌ర్ త‌ల్లి వెల్ల‌డించ‌లేదు. ఐదేళ్లుగా కోమాలో ఉన్న త‌న బిడ్డ‌తో ఒక జోక్ చెప్తే త‌న‌తో క‌ద‌లిక‌లు వ‌చ్చాయ‌ని.. అది చూసి జెన్నిఫ‌ర్‌కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్ట‌ర్ ఇది నిజంగా అద్భుతం అన్నార‌ని తెలిపారు. అయితే త‌న బిడ్డ ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. క‌ళ్లు తెరిచి చూడ‌గ‌లుగుతోంది కానీ మాట్లాడ‌టంలేద‌ని త్వ‌ర‌లో పూర్తిగా కోలుకుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు తెలిపారు. జెన్నిఫ‌ర్ చికిత్స కోసం గో ఫండ్ మీ క్యాంపెయిన్ ద్వారా యావ‌త్ అమెరికా ఫండ్స్ డొనేట్ చేస్తోంది.

ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌గానే ఆ జోకేంటో చెప్తే మేం కూడా న‌వ్వుకుంటాం కదా అని నెటిజ‌న్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు. ఈ విష‌యం బ‌య‌టికి రావ‌డంతో జెన్నిఫ‌ర్ త‌ల్లిని స్థానిక మీడియా వ‌ర్గాలు ఇంట‌ర్వ్యూల కోసం వెంబడిస్తున్నాయ‌ట‌. ఆ జోక్ ఏంటో చెప్పండి అంటూ హాస్పిట‌ల్ వ‌ర‌కు వెళ్లిపోతున్నార‌ట‌. త‌న‌కు మీడియాతో మాట్లాడ‌టం కంటే ఎన్నో ముఖ్య‌మైన ప‌నులు ఉన్నాయ‌ని.. త‌న బిడ్డ పూర్తిగా కోలుకున్నాక అప్పుడు ఆ జోక్‌పై త‌ప్ప‌కుండా మాట్లాడ‌తాన‌ని జెన్నిఫ‌ర్ త‌ల్లి వెల్ల‌డించారు.