స్పీడ్​ పెంచిన యంగ్​ హీరోలు!

టాలీవుడ్​లో అటు సీనియర్​ హీరోలు ఒకేసారి నాలుగయిదు ప్రాజెక్టులు చేస్తుంటే, ఇటు యంగ్​ హీరోలూ తామేం తక్కువ కాదంటూ వరుస సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. టాలీవుడ్​ సెన్సేషన్ విశ్వక్​సేన్​ తాజాగా దాస్​ కా ధమ్కీతో హిట్​ కొట్టి అదే ఊపులో మరో రెండు సినిమాలు మొదలు పెట్టేశాడు. వినరో భాగ్యము విష్ణుకథతో మంచి విజయం అందుకున్న కిరణ్​ అబ్బవరం మీటర్​ సినిమాతో త్వరలోనే రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ కూడా విడుదలైంది. ఎనర్జిటిక్​ హీరో రామ్​ పోతినేని కాస్త గ్యాప్​ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్​ జాతర చేసేందుకు దసరాకి వచ్చేస్తున్నాడు. ఈ యంగ్​ హీరోల సినిమాల అప్​డేట్స్​ ఏంటో చూద్దాం..

పుట్టినరోజు సందర్భంగా విశ్వక్ సేన్​ తన తదుపరి మూవీని అనౌన్స్‌ చేశాడు. #VS11 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నాడు. లిరిసిస్ట్‌గా అద్భుతమైన పాటలు రాయడమే కాక ‘రౌడీఫెలో, ఛల్ మోహన రంగ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య.. డైరెక్టర్‌గా తన మూడో సినిమాను విశ్వక్ సేన్‌తో చేయబోతున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ పాత్ర మనుపెన్నడూ కనిపించనంత మాస్ యాంగిల్‌లో ఉంటుందని, ఇదొక గ్రే క్యారెక్టర్‌ అని కూడా మేకర్స్ సితార ఎంటర్‌టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ ఫార్చూన్ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, సాయి సౌజన్యఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ కంపోజర్ యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే రాజమండ్రిలో ప్రారంభం కానుంది.

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో మంచి జోరుమీదున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ వేసవి కానుకగా ఏప్రిల్ 7న మీటర్​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ‘గంప దాటిన కోడిపిల్ల గడప దాటిన ఆడపిల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దొరికితే బిర్యానీ అవుతుంది. నువ్వు దొరికితే బత్తాయి అవుతావు’,‘భగవంతుడి ముందు భక్తితోనూ బలవంతుడి ముందు భయంతోనూ ఉండాలి లేదంటే..’, ‘ది ఈజ్ ద బెస్ట్ రిక్రూట్‌మెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ డిపార్ట్‌మెంట్’ వంటి డైలాగ్​లు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇస్మార్ట్ శంక‌ర్‌తో తనలోని మాస్​ యాంగిల్​ని బయటపెట్టాడు ఎనర్జిటిక్​ హీరో రామ్​ పోతినేని. ఇక అప్ప‌టి నుంచి రామ్​ మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌పైనే ఫోక‌స్ చేస్తున్నాడు. రామ్​ ప్రస్తుతం బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల‌ను మాస్‌గా ఎలివేట్ చేయ‌టంలో బోయ‌పాటి స్టైలే వేరు. అయితే రొటీన్‌కి భిన్నంగా ఇటు రామ్ అటు బోయపాటి శ్రీను ఏకంగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌ ఇచ్చారు మేక‌ర్స్ . అక్టోబర్​ 20న దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇక, ఈ సినిమాలో రామ్‌ను వైల్డ్ లుక్‌లో కనిపించారు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తోన్న ఈ భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీకి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. రామ్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇక ఈ సినిమా హిట్​ అయితే రామ్​ కూడా పాన్​ ఇండియా స్టార్స్​ జాబితాలో చేరతాడనడంలో సందేహం లేదు.