మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు.. ఎన్నికల తేదీలు, ఫలితాలు ఎప్పుడన్న వివరాల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం ప్రకటించింది. కర్ణాటకలో ఉన్న మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 13నే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇక బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
తొలిసారి ‘ఓటు ఫ్రమ్ హోం’ సదుపాయం..
ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం లాగా.. వృద్దులు, వికలాంగులకు ఓటు ఫ్రం హోం సదుపాయాన్ని ఈసీ ఈ ఎన్నికల నుంచి కల్పించింది. దేశంలోనే తొలిసారిగా ఓటు ఫ్రం హోం సదుపాయాలన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. దీనిని ప్రయోగాత్మకంగా కర్ణాటక రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో వినియోగించనుంది. అయితే.. దీనికి 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు ఉంటాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) రాజీవ్ కుమార్ వెల్లడించారు. అలాంటి వారు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 12.15 లక్షల మంది వృద్ధులు.. 5.6 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం కలగనుంది. ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. రాష్ట్రంలో 16,976 మంది 100ఏళ్లు పైబడిన ఓటర్లున్నట్లు తెలిపారు. శతాధిక వయసు గల ఓటర్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటకనే కావడం విశేషం.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల వివరాలు ఇలా..
కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్ల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్లు, మహిళలు 2.59 కోట్ల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక ఏప్రిల్ 13వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే 24తో ముగియనుండగా బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా..
కర్ణాటకలో మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికలపై ప్రస్తుతం అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్షం కాంగ్రెస్, స్థానిక పార్టీ జేడీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కొన్ని పార్టీలు ఇప్పటికే ఉచితాలను సైతం ప్రకటించేసింది. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు పలువురు కర్ణాటకు పదే పదే వస్తూ మీటింగ్‌లు ఏర్పాటు చేసి.. ఓట్లు దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 119 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ పార్టీకి 75 మంది, జేడీ(ఎస్)కు 28 మంది శాసనసభ్యుల బలముంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తుండగా, మరో వైపు ప్రతిపక్షాలు కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికల్లో కన్నడిగుల విషయం, లింగాయత్, వొక్కలింగాలకు రిజర్వేషన్ అంశాలు కీలక అంశాలుగా మారాయి. అయితే బీజేపీ ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడంతో ఈ అంశం ముస్లిం ఓటర్లు కొంత ఇతర పార్టీలవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.