ఉంగరం పోయిందని విద్యార్థిని సూసైడ్
సమస్య చిన్నదా, పెద్దదా అన్న తేడాలు లేకుండా చిన్న విషయాలకే ఈ మధ్య కాలంలో యువతీ, యువకులు ఆత్మహత్య చేసుకోవడం సాధారణమైపోయింది. అమ్మనాన్నలు తిట్టారనో, ప్రేమ విఫలమైందనో, కాలేజీల్లో వేధింపుల వల్లనో, మార్కులు తక్కువ వచ్చాయని, పరీక్ష బాగా రాయలేకపోయానని ఇలా కారణాలు ఏమైనా పరిష్కారం మాత్రం చనిపోవడమే అన్న భావనకు నేటి యువత వచ్చేస్తున్నారు. ఇది చాలా ఆందోళనకర విషయం. ఇక ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. చేతి వేలికి ఉన్న ఉంగరం పోయిందనే బాధతో డిగ్రీ చదివే ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కేవలం బంగారు ఉంగరం పోయిందని నిండు జీవితాన్ని ఆమె బలితీసుకుంది. ఆత్మహత్యకు ముందు తన తండ్రికి లేఖ రాసి మరీ చనిపోయింది.
అంతకు ముందు గొలుసు.. ఇప్పుడు ఉంగరం పోగొట్టుకుని..
వరంగల్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లికి చెందిన మద్దుల జానకి రాములు, రాణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె హేమలతారెడ్డి(19) హనుమకొండలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్న కుమార్తె ఎనిమిదో క్లాస్ చదువుతుంది. ఇద్దరు కుమార్తులు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నారు. ఈక్రమంలో ఉగాది సందర్భంగా పెద్ద కుమార్తె హేమలతారెడ్డి ఈ నెల 20న ఇంటికొచ్చింది. ఇక ఉగాది పండుగ కావడంతో ఈనెల 22న చేతికి ఉంగరం పెట్టుకుంది. సాయంత్రం చూసే సరికి చేతికి ఉన్న ఉంగరం కనిపించలేదు. అన్నిచోట్ల వెతికినా ఫలితం లేకపోవడంతో హేమలతారెడ్డి తీవ్ర మనోవేదనకు గురైంది. ఆరు నెలల కిందట బంగారు గొలుసు ఇదే విధంగా పోగొట్టుకుంది. ఇప్పుడు ఉంగరం కూడా పోవడంతో తల్లిదండ్రులు ఏమంటారో అని తీవ్ర ఆందోళన, మనోవేదనకు ఆమె గురైంది.
కన్న తండ్రికి లేఖ రాసి.. ఆత్మహత్య..
హేమలతారెడ్డి తల్లిదండ్రులు మద్దుల జానకి రాములు, రాణి దంపతులు మంగళవారం(నిన్న) ఉదయాన్నే పొలం పనులకు వెళ్లిపోయారు. అప్పటికే మానసికంగా కుంగిపోయి ఉన్న ఆమె ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చింది. దీంతో తన తండ్రికి లేఖ రాసింది. ‘సారీ డాడీ… ఉంగరం పోయిందని నాకు భయమేస్తోంది’ అంటూ లేఖ రాసిపెట్టి ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు తలుపులు తీసేందుకు ప్రయత్నించగా.. అవి తెరుచుకోలేదు. అనుమానంతో బలంగా తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్లి చూడగా పెద్ద కుమార్తె ఉరి వేసుకుని ఉంది. వెంటనే కిందకు దింపి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి విద్యార్థిని మృతికి గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కేవలం అరతులం ఉండే ఉంగరం పోయిందని.. యువతి ఆత్మహత్య చేసుకోవడం.. బాధాకరమని చుట్టుపక్కల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.