నిజామాబాద్‌లో పుట్టిన మాణిక్యం నిఖత్: KCR
న్యూఢిల్లీలోని కే.డి జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో, 50 కేజీల విభాగంలో, నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ ను సీఎం అభినందించారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్ పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి, మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియషిప్‌లో భారత్ కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సీఎం అన్నారు. తన వరుస విజయాలతో దేశ ఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్ లో ఇది రెండవ బంగారు పథకం కావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు.
నిజామాబాద్‌లో పుట్టిన మాణిక్యం నిఖత్..
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ పుట్టింది నిజామాబాద్‌లోనే. అక్కడే ఆమె స్కూలింగ్, ఇంటర్ వరకు చదువుకుంది. అనంతరం డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. 1996లో పుట్టిన నిఖత్.. ఆమె తండ్రి మహ్మద్ జమీల్ అహ్మద్ ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి బాక్సింగ్ నేర్చుకుంది. తండ్రి వద్దే కొన్నాళ్లు శిక్షణ పొందిన తర్వాత 2009తో విశాఖపట్నంలో శిక్షణ పొందారు. ఈక్రమంలో అనేక పోటీల్లో ఆమె పాల్గొని మెడల్స్ సాధించారు. ఈనేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా బాక్సింగ్ ప్రస్తానాన్ని కొనసాగించిన నిఖత్.. 2011 నుంచి 2023 వరకు ఏటా ఏదోక పోటీల్లో గెలుపొందుతూనే ఉంది. అయితే.. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ గెలవడంతో… అంతర్జాతీయ క్రీడాకారిణి తెలంగాణకు చెందిన అమ్మాయి, తెలుగు బిడ్డగా గుర్తింపు వచ్చింది.