Telangana: ఉచిత బస్సు సర్వీస్ రద్దు?
Telangana: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం (free bus scheme) రద్దు కాబోతోందా? అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. ఈ పథకాన్ని రద్దు చేయాల్సిందిగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. అవసరం లేని మహిళలు కూడా ఉచితమే కదా అని ప్రయాణాలు చేస్తున్నారని దీని వల్ల టికెట్ కొని ప్రయాణిస్తున్న పురుషులు సీట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు.
మరోవైపు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై పడే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే హక్కు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం కల్పించి పురుషులకు కల్పించకపోవడం ప్రభుత్వం చూపుతున్న వివక్షే అవుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. ఉచిత ప్రయాణాన్ని అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసిన జీవో 47ను రద్దు చేయాలని పిటిషన్లో ప్రస్తావించారు.
1950లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా చట్టం ప్రకారం ఆర్టీసీ కార్పొరేషన్ ఏర్పాటైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆనాడే కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. త్వరలో హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరగనుంది.