Allu Arjun: 20 ఏళ్లయినా.. తగ్గేదేలే!

గంగోత్రి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్.. తన స్టైల్‌, డాన్స్‌, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న బన్నీ స్టైలిష్‌ స్టార్‌‌గా పేరు తెచ్చుకున్నారు. ప్రతి సినిమాలోనూ వైవిద్యాన్ని చూపిస్తూ అభిమానులతోపాటు సినీ ప్రేమికులను అలరిస్తున్న ఈ ఐకాన్ స్టార్.. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అల్లు అర్జున్‌ నటించిన మొదటి సినిమా గంగోత్రి విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయ్యింది.  ఈ సందర్భంగా ఇరవై ఏళ్లుగా తనను ఎంతగానో ఆదరించిన అభిమానులు, ప్రేక్షకులకు సోషల్​ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పారు బన్నీ. ఈ రెండు దశాబ్దాలలో స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ సినీ ప్రయాణంపై ఒక లుక్కేద్దాం..
అల్లు అర్జున్.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేవి డాన్స్, స్టైల్. ప్రతి సినిమాలోనూ విభిన్నమైన స్టైల్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు బన్నీ. అందుకే ఫ్యాన్స్ ఆయనను స్టైలిష్‌ స్టార్ అని పిలుచుకుంటారు. డాన్స్‌, కాస్ట్యూమ్స్‌, సినిమాలతో అభిమానులందరికీ ఐకాన్‌గా మారిపోయారు. దాంతో ప్రస్తుతం అందరూ బన్నీని ఐకాన్‌ స్టార్‌‌ అంటున్నారు.

ముందు విమర్శలు..
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా, అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్‌ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ మాత్రమే లభించింది బన్నీకి. సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన గంగోత్రి సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాగానే ఆడింది. అయితే, అల్లు అర్జున్ లుక్స్ ఈ సినిమాలో అంతగా ఎవరినీ ఆకట్టుకోలేదు. ఈ కుర్రాడు హీరోనా అని చాలామంది విమర్శించారు. అయితే ఆ విమర్శలను బన్నీ పట్టించుకోలేదు. సుకుమార్ దర్శకత్వంలో రెండో సినిమా చేశారు. అదే ఆర్య. ఈ సినిమాలో బన్నీ కొత్త లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆర్య సినిమా సూపర్‌‌హిట్‌టాక్ తెచ్చుకుంది. లవ్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాతో బన్నీకి లవర్‌‌ బాయ్ ఇమేజ్ వచ్చింది. సినిమా సినిమాకూ తనలోని నటనతో కోట్లాది మందిని అలరిస్తూ వాళ్ల అభిమాన హీరోగా ఎదిగారు బన్నీ.
క్యారెక్టర్‌‌తో చేరువవుతూ..
అల్లు అర్జున్ నటించిన చాలా సినిమాల టైటిల్స్‌ కూడా విభిన్నంగానే ఉంటాయి. ఆయన సినిమాలకు యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా బాగా కనెక్ట్ అవుతారు. తన సినిమాల్లో యూత్‌కు కావలసిన అన్ని ఎలిమెంట్స్‌ ఉండేలా చూసుకునే బన్నీ.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావలసిన వాటిపై కూడా దృష్టి పెడుతుంటారు. ఇక, ఇటీవల వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా క్రేజ్ దక్కించుకున్నారు అల్లు అర్జున్. అ సినిమాలో టైటిల్‌ రోల్ ప్లే చేసిన బన్నీ.. డీ గ్లామర్‌‌గా కనిపిస్తూనే తన మార్కు స్టైల్‌ను కూడా చూపించారు.
ఈ సినిమాతో బన్నీ ఇమేజ్‌ కూడా దేశవ్యాప్తమైంది. పుష్ప సినిమాలోని పాటలు, బన్నీ స్టెప్స్, మేనరిజం విపరీతంగా వైరల్ అయ్యాయి. అందులోని పాటలు, స్టెప్స్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు. తెలుగుతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ పుష్ప సినిమా సక్సెస్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల వసూళ్ల వర్షం కురిపించింది. పుష్ప సినిమాతో బన్నీ హిందీలో కూడా హిట్‌ అందుకున్నారు. ఈ సినిమాలో పుష్ప రాజ్‌గా ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రతి సినిమా పాఠంగా..
‘గంగోత్రి’లో సింహాద్రి పాత్రలో అమాయకంగా కన్పించిన కుర్రాడికి, ‘పుష్ప’లో కరడుగట్టిన స్మగ్లర్‌లా కన్పించిన నటుడికి ఎంతో తేడా ఉంది. నటుడిగా తనను తాను మెరుగుపరచుకొనేందుకు, నిరూపించుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ అల్లు అర్జున్ వదులుకోలేదని చెప్పవచ్చు. 2003 మార్చిలో గంగోత్రి విడుదలయ్యే నాటికి అల్లు అర్జున్‌కు 21 ఏళ్లు నిండలేదు. ఆ వయసులో కొత్త నటులకు సాధారణంగా ఉండే బెరుకు, అమాయకత్వం ఆయనలో కనిపిస్తాయి. మొదటి సినిమాలో ఆయన నటన పై విమర్శలు చాలానే వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏడాది వచ్చిన ఆర్య సినిమాలో నటనతో, నాడు విమర్శించిన వారిని కూడా ఆయన మెప్పించారు. అందులో పరిణితి, సరదాతనం కలబోతగా ఉండే పాత్రలో అల్లు అర్జున్ కనిపించారు. అల్లు అర్జున్ పోషించిన పాత్రల్లో అత్యధికం ప్రేక్షకులకు చేరువైనవే. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి లాంటి సినిమాల్లో చాలా సరదాగా ఉండే పాత్రల్లో ప్రేక్షకులను నవ్విస్తే, పరుగు, వేదం, వరుడు లాంటి సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ గుండె బరువెక్కేలా చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాల్లో పోషించిన పాత్రలతో చాలా మందికి ఒక కుటుంబ సభ్యుడిలా కనిపించారు.’రేసుగుర్రం’లో లక్కీ పాత్రలో భరించలేని అల్లరి చేసిన అల్లు అర్జున్, సరైనోడు, నా పేరు సూర్య సినిమాల్లో అంతే సీరియస్‌గా కన్పించారు. పాత్ర ఏదైనా అందులో తన మార్క్ నటన కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తారు. అదే సమయంలో, విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయం పలకరించినప్పుడు కుంగిపోవడం కనిపించవు. ‘నా పేరు సూర్య’ పరాజయాన్ని ఆయన హుందాగా ఒప్పుకొంటారు.
డ్యాన్స్​ ప్రత్యేకం
అల్లు అర్జున్ అనగానే అత్యధికులకు మొదట గుర్తుకు వచ్చేది డ్యాన్సే. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలోని ప్రపంచవ్యాప్తంగా పాపులర్​ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్ల దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ స్టెప్‌ను అనుకరిస్తూ లెక్కలేనన్ని వీడియోలు చేశారు. ‘అల వైకుంఠపురములో…’ సినిమాలో బుట్టబొమ్మ పాటలో అల్లు అర్జున్ డ్యాన్స్ మూమెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్‌గా మారాయి. దాదాపు ప్రతి సినిమాలో సిగ్నేచర్ స్టెప్స్ ఉంటాయి. దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు బన్ని.
ప్రయోగాలు..
ప్రయోగాలకు అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. కథ, కథనం నచ్చితే పాత్ర పరిధి, నిడివి తక్కువైనా చేసేందుకు వెనుకాడరు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కథకు చాలా ముఖ్యం. కానీ అతిథి పాత్ర అయినా చేశారు. క్రిష్ (రాధాకృష్ణ జాగర్లమూడి) దర్శకత్వంలో వచ్చిన ‘వేదం’ సినిమాలో కేబుల్ రాజు పాత్ర పోషించి, విభిన్నమైన కథ ఉంటే చేయడానికి తాను సిద్ధమని సంకేతాలిచ్చారు. పుష్ప సినిమా కోసం దాదాపు ఏడాది పాటు చిత్తూరు యాసను అల్లు అర్జున్ సాధన చేశారు. ‘బద్రినాథ్’ సినిమా కోసం మలేషియా వెళ్లి కత్తియుద్ధం నేర్చుకున్నారు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం తెలంగాణ శైలిలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు. ఈ అంకితభావమే ఆయన్ను తెలుగు చిత్ర పరిశ్రమల్లో టాప్ నటుల్లో ఒకరిని చేసింది.
ఫాలోవర్స్​ ఎక్కువే..
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు అల్లు అర్జున్. తన సినిమాల అప్‌డేట్స్ అభిమానులతో పంచుకుంటుంటారు. షూటింగ్ లొకేషన్లో ఉండే ఫొటోలు షేర్ చేస్తుంటారు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తెలుగు నటుడు, తెలుగు వ్యక్తి బన్నీనే. ఫేస్‌బుక్‌లో 21 మిలియన్ల మంది, ట్విటర్‌లో 6.6 మిలియన్ల మంది ఆయన్ను ఫాలో అవుతున్నారు. సినిమాలే కాకుండా వ్యాపార రంగంలోనూ అల్లు అర్జున్ అడుగుపెట్టారు. బఫెలో వింగ్స్ పేరుతో హైదరాబాద్‌లో ఆయన ఒక రెస్టారెంట్ నడుపుతున్నారు.
ఫ్యామిలీ మ్యాన్
సినిమాలు, షూటింగ్​లు లేకపోతే అల్లు అర్జున్ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్‌లా మారిపోతారు. కొడుకు అయాన్​, కూతురు అర్హతో కలిసి కేరింతలు కొడతారు. అవన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఫ్యామిలీతో టూర్లకు వెళ్తుంటారు. షూటింగ్ మధ్యలో ఏ మాత్రం విరామం దొరికినా ఆ సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తారు. ఇక, అల్లు అర్జున్ తర్వాతి చిత్రమైన పుష్ప సీక్వెల్ ‘పుష్ప: ద రూల్’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.​