“తెలంగాణ” బొమ్మ బ్లాక్‌బస్టర్..!
నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతానిది ప్రత్యేక సంస్కృతి. హిందీ, ఉర్దూ, అరబిక్ కలగలసిన తెలుగు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి విషయాన్ని సొంతం చేసుకుని పలకరించే తెలంగాణ యాస, వేషధారణ, అందరినీ బంధువులను చేసుకుని అన్న, అక్క అంటూ ఆత్మీయ పలకరింపు తెలంగాణకే సొంతం. ఒకప్పుడు తెలంగాణ యాసంటే కాస్త చిన్నచూపు ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం అందరి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఘన విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలాకాలంగా సినిమాల్లోని విలన్లకు మాత్రమే పరిమితమైన తెలంగాణ యాస, సంస్కృతిని ప్రధానంగా చేసుకుని తెరకెక్కుతున్న చిత్రాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అద్దుకుని తెరపై మెప్పించిన సినిమాలేవో చూద్దాం..
దసరా
నాని, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో రానున్న చిత్రం దసరా. ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ లో డైలాగ్స్ మెప్పించాయి. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ సినిమా మార్చి 30న తెలుగుతోపాటు అయిదు భాషల్లో పాన్ఇండియా సినిమాగా విడుదల కానుంది.
బలగం
జబర్ధస్త్ షోతో కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన చిత్రం బలగం. తెలంగాణ లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న సినిమాగా అందరినీ బాగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా ఒదిగిపోయారు. దిల్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్గానూ మంచి విజయం దక్కించుకుంది.
విరాటపర్వం
రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. తెలంగాణకు చెందిన సరళ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఓ నక్సలైట్‌ను ప్రేమించిన సరళ ఎదుర్కొన్న సమస్యలు, చివరకు ఆమెను అతనే దారుణంగా చంపిన తీరు ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. ఈ సినిమాని వేణు ఉడుగుల రూపొందించగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం లవ్ స్టోరీ. చిత్రంలో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి వివరించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, ఓవర్సీస్లోనూ కూడా మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాలోని నటీనటులంతా తెలంగాణ యాసలో మాట్లాడగా షూటింగ్ కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనే ప్లాన్ చేసింది చిత్రబృందం.
రుద్రమదేవి
కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ ‘ది వారియర్ క్వీన్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైంది. ఈ సినిమాలో కాకతీయ సామ్రాజ్యం, తెలంగాణలోని నేటి వరంగల్ ఒకప్పటి ఓరుగల్లు రాజధానిగా రుద్రమదేవి పాలన గురించి వివరించారు.
ఫిదా
వరుణ్ తేజ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఫిదా మూవీ లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ – బస్టర్ ఫలితాలతో తడిసి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. అయితే ఈ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటినా ఈ పాట మాత్రం, ఇంకా జనాల మదిలోనే కాక నాలుకలపై కూడా నర్తిస్తుంది. అప్పుడప్పుడు వార్తల్లోకి ప్రవహిస్తూనే ఉంది. “వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే..” అంటూ సింగర్ మధుప్రియ పాడిన అశోక్ తేజ గీతానికి స్పింగులు మింగినట్లు సాయిపల్లవి తన నృత్యంతో నర్తించి అందరినీ ఫిదా చేసిన ఈ పాట ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీ లో టాప్ రికార్డు ను సొంతం చేసుకుంది.
ఒసేయ్ రాములమ్మ
విజయ శాంతి ప్రధాన పాత్రలో 1997 వ సంవత్సరం లో వచ్చిన ఒసేయ్ రాములమ్మ చిత్రం లో కూడా ఆనాటి తెలంగాణ పరిస్థితుల్ని చూపించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయశాంతి, దాసరి, రామిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించారు. భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా అన్యాయానికి గురైన ఒక దళిత మహిళ చేసిన పోరాటమే ఈ చిత్రం. ఒక సాధారణ మహిళా నక్సలైట్ గా ఎలా మారింది అనేది కథాంశం. ఈ చిత్రానికి వందేమాతరం శ్రీనివాస్ యాదవ్ సంగీతాన్నందించడమే కాక దాదాపు అన్ని పాటలు ఆయనే పాడారు.
ఇవే కాకుండా చాలా సినిమాలు తెలంగాణ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకులను మెప్పించాయి. డీజే టిల్లు సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా తెలంగాణ యాసతో డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలోనే కొనసాగుతుంది. నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన జాతి రత్నాలు చిత్రం లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం లోని కొమురం భీం కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న మూవీ లో కూడా ఆనాటి తెలంగాణ పరిస్థితుల్ని చూపించారు. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఫలక్ నామా దాస్ సినిమాలో కూడా హైదరాబాద్ లో జరిగే పరిస్థితులని చూపించారు. రోజా, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో దాసరి నారాయణ రావు తెరకెక్కించిన సమ్మక్క సారక్క చిత్రం తెలంగాణ నేపథ్యం లోనే సాగుతుంది. హీరోయిన్ సింధు తులాని ప్రధాన పాత్రలో వచ్చిన బతుకమ్మ చిత్రం లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు.