రాత్రి కాఫీకి ర‌మ్మంది.. తప్పించుకున్నా

సినీ ఇండ‌స్ట్రీలో జ‌రిగే క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌లు ఇప్ప‌టికే ఎన్నో బ‌య‌టికి వ‌చ్చాయి. క్యాస్టింగ్ కౌచ్ బాధితుల్లో చాలా మ‌టుకు హీరోయిన్లకు, లేడీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులే ఉన్నారు. అయితే క్యాస్టింగ్ కౌచ్ అనేది ఏ ఒక్క జెండ‌ర్‌కు ప‌రిమితం కాద‌ని మ‌గ‌వారు కూడా ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర్కొంటార‌ని అంటున్నారు ప్ర‌ముఖ న‌టుడు, గోర‌ఖ్‌పూర్ ఎంపీ ర‌వి కిష‌న్. రేసు గుర్రంలో విల‌న్ పాత్ర‌లో న‌టించి మెప్పించిన ర‌వి కిష‌న్ పేరుగ‌ల భోజ్‌పురి న‌టుడు. తెలుగు, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టించారు. అయితే తాను కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాన‌ని అంటున్నారు. ఆప్ కీ అదాలత్ అనే షోలో త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని వెల్లడించారు.

“ఈ క్యాస్టింగ్ కౌచ్ ఇండ‌స్ట్రీలో ఉంది. నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ నాకు మా నాన్న ఒక మాట చెప్పారు. నేను నిజాయ‌తీగా ఉంటూ నా ట్యాలెంట్‌ను చూపించుకుంటూ అవ‌కాశాలు సంపాదించుకోవాల‌ని చెప్పేవారు. నేను అదే ఫాలో అయ్యాను కాబ‌ట్టే ఓ మ‌హిళ నుంచి త‌ప్పించుకోగ‌లిగాను. రాత్రి కాఫీ తాగ‌డానికి వ‌స్తారా అని అడిగింది. కాఫీ పొద్దున తాగుతారు. అలాంటిది రాత్రి తాగుతారా అని అడుగుతోంది అంటే ఆమె ఉద్దేశం నాకు అర్థ‌మైంది. దాంతో నేను రాను అని చెప్పేసాను. నాకు నా టాలెంట్ మీద న‌మ్మ‌కం ఉంది. క‌ష్ట‌ప‌డే ఈ స్థాయిలో ఉన్నాను. న‌న్ను వాడుకోవాల‌ని చూసిన మ‌హిళ గురించి నేను ఇప్పుడు బ‌య‌ట‌పెట్ట‌లేను. ఎందుకంటే ఆమె ఇప్పుడు బిగ్ షాట్. నేను బ‌నార‌స్‌లోని ఓ చిన్న గ్రామంలో పుట్టాను. మా నాన్న పూజారి. నేను యాక్టింగ్ వైపు వెళ్తానంటే ఆయ‌న ఒప్పుకోలేదు. కానీ మా అమ్మ నాకు స‌పోర్ట్ చేసింది. అలా నా చేతిలో 500 రూపాయ‌లు పెట్టింది. నేను కేవ‌లం ఆ డ‌బ్బుతో యాక్టింగ్‌పై ఇష్టంతో ముంబై వెళ్లాను. ఇప్ప‌టికీ ఎల‌క్ష‌న్ల స‌మ‌యంలో మా అమ్మ‌నే స‌ల‌హాలు అడుగుతుంటాను” అని తెలిపారు ర‌వి కిష‌న్‌.