ISRO రికార్డు.. ఒకేసారి కక్ష్యలోకి 36 ఉపగ్రహాలు!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోమారు అరుదైన రికార్డును నమోదు చేసింది. నిన్న ఇస్రో ప్రయోగించిన ఎల్‌వీఎం-3 వాహకనౌక.. వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టి గొప్ప ఘనతను సొంతం చేసుకుంది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9 గంటలకు 5,805 కేజీల పేలోడ్‌తో ఎల్‌వీఎం-3 వాహకనౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహాలను 450 కి.మీ.ల వృత్తాకార కక్ష్యలో 87.4 డిగ్రీల వంపుతో విజయవంతంగా వదిలిపెట్టింది. రాకెట్ బయలుదేరిన తొమ్మిది నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యను చేరుకోగా 20వ నిమిషం నుంచి ఉపగ్రహాలను కక్ష్యలో పెట్టడం ప్రారంభించింది. ఈ దశలో సీ-25 స్టేజ్ అద్భుతంగా పనిచేసిందని ఇస్రో పేర్కొంది. ఉపగ్రహాలు ఒకదానినొకటి ఢీకొనకుండా నిర్దేశిత సమయాంతరాల్లో వాటిని విడిచిపెట్టింది. అన్ని ఉపగ్రహాలనూ కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు తొమ్మిది దశల్లో 1:27 గంటల సమయం పట్టింది. ప్రయోగం విజయవంతమైన అనంతరం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్ ఇస్రో బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
గతంలోనూ 36 ఉపగ్రహాలను పంపింది..
ఎల్‌వీఎం-3 ప్రయోగం ఇస్రో ప్రయాణంలో కీలకం అని చెప్పవచ్చు. వన్‌వెబ్‌కు చెందిన 36 ఉప గ్రహాలను గతంలో ఇస్రో నుంచి ప్రయోగించారు. రెండో దఫాలో భాగంగా మరోసారి 36 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టి.. ఇస్రో సత్తా ప్రపంచానికి చాటి చెప్పారు ఇక్కడి శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఎన్‌ఎస్‌ఐఎల్ ఛైర్మన్, ఎండీ, రాధాకృష్ణన్‌లు మాట్లాడుతూ.. ఈ విజయం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్), ఇస్రో సంస్థలకు గర్వకారణం అని అన్నారు. తమ సామర్థ్యాలను విశ్వసించినందుకు వన్‌వెబ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ 72 ఉపగ్రహాలను ప్రయోగించడానికి వన్ వెబ్ తో గతంలో ఒప్పందం చేసుకుంది. 2022 అక్టోబరు 23న 36 ఉపగ్రహాలు, ఈరోజు మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వాణిజ్య ప్రయోగాల్లో ఇస్రో మరోసారి సత్తా చాటింది. LVM3-M3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం 36 ఉపగ్రహాల్లో 16 ఇప్పటికే వాటి వాటి కక్ష్యల్లో కుదురుకున్నాయి. మిగతా 20 ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి భూమిపై ఉన్న ఎర్త్ స్టేషన్లకు సిగ్నల్స్ పంపిస్తాయని తెలిపారు అధికారులు. విజిబిల్ ఏరియాలో ఆ శాటిలైట్స్ సెపరేషన్ జరగదని చెప్పారు. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్‌వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4° వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.