5 Guarantees: తెలంగాణలో లేనివారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
5 Guarantees: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన దరఖాస్తు పత్రాల కోసం లబ్ధిదారులు పోటెత్తుతున్నారు. తెలంగాణకు చెందిన తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ గ్యారెంటీలు వర్తిస్తాయి. అయితే తెలంగాణ వాసులే అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినవారి సంగతేంటి? వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన లబ్ధిదారులు స్వయంగా వచ్చి మరీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. బంధువుల ద్వారా దరఖాస్తు చేయించుకునే అవకాశం ఉంది. అయితే దరఖాస్తులో లబ్ధిదారుని పేరు గృహిణి అయివుండాలి కాబట్టి వారే రావాలా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆ గృహిణికి సంబంధించిన వారు ఎవరైనా కావాల్సిన డాక్యుమెంట్ల ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకుని సబ్మిట్ చేసే అవకాశం ఉంది.
మరోపక్క దరఖాస్తులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నా కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.80 చొప్పున వసూలు చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.