Qatar: ఆ భార‌తీయుల‌కు శుభ‌వార్త‌.. మ‌ర‌ణ‌శిక్ష లేదు

Qatar: ఖ‌తార్‌లో ఉరిశిక్ష ప‌డిన ఎనిమిది మంది మాజీ నేవీ అధికారుల‌కు ఊర‌ట ల‌భించింది. వారికి ప‌డిన మ‌ర‌ణ‌శిక్ష‌ను కొట్టివేస్తూ సాధార‌ణ జైలు శిక్ష వేయాల‌ని అక్క‌డి న్యాయ‌స్థానం తీర్పు వెల్ల‌డించింది. అయితే ఆ అధికారులు జీవిత ఖైదు విధించిందా లేదా ఇన్నేళ్ల పాటు జైల్లో ఉండాల‌ని తీర్పునిచ్చిందా అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌రాలేదు.

ఖ‌తార్‌లో గూఢ‌చ‌ర్యం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై అక్కడి ప్ర‌భుత్వం వారిని 2022లో అదుపులోకి తీసుకుంది. వీరంతా అప్ప‌ట్లో అల్ ద‌హ్రా అనే కంపెనీలో ప‌నిచేస్తుండేవారు. వీరు జ‌లాంత‌ర్గామికి సంబంధించిన అంశంలో గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపిస్తూ వారిని అదుపులోకి తీసుకుంది. వీరంతా భార‌త్‌కు చెందిన‌వారు కావ‌డంతో ఇక్క‌డి ప్ర‌భుత్వంలో మాట్లాడించే ప్ర‌య‌త్నం కూడా చేసింది. భార‌త ప్ర‌భుత్వం వారిని విడిపించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది కానీ అవేవీ ఫ‌లించ‌లేదు. ప‌లుమార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ కేసు విష‌యంలో ఖ‌తార్ న్యాయ‌స్థానం ఈరోజు తీర్పు వెల్ల‌డిస్తూ వారికి మ‌ర‌ణ శిక్ష‌ను విధించింది.

భార‌త ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని వారికి ప‌డిన మ‌రణ శిక్ష‌ను ర‌ద్దు చేయ‌డానికి అప్పీలు దాఖ‌లు చేయ‌గా అక్క‌డి న్యాయ‌స్థానం వాద‌న‌లు వినేందుకు ఒప్పుకుంది. ఆ తర్వాత భార‌త్ త‌ర‌ఫున న్యాయ‌వాది వాద‌న‌ల ప‌ట్ల సంతృప్తి చెందిన న్యాయ‌మూర్తి మ‌ర‌ణ శిక్ష అవ‌స‌రం లేద‌ని తీర్పు ఇచ్చారు.