భోళాశంకర్​ రిలీజ్​ డేట్ ఫిక్స్

వాల్తేరు వీరయ్యతో కొత్త సంవత్సరంలో బ్లాక్ బస్టర్ హిట్‌ కొట్టి మంచి జోరు మీదున్నారు మెగాస్టార్ చిరంజీవి. కమ్​బ్యాక్​ తర్వాత వరుస సినిమాలు చేసేస్తున్న చిరు తాజాగా మరో సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఆచార్య ఫలితంతో కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్న మెగాస్టార్​ ఎక్కువగా రీమేక్​లపై దృష్టి పెడుతున్నారు. సంక్రాంతి పండుగకు వాల్తేరు వీరయ్య సినిమాతో కమర్షియల్ హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఆయన అభిమానులు కూడా అదే జోష్‌లో ఉన్నారు. అయితే చిరు మాత్రం తన కొత్త సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు.

అందులో భాగంగానే కొత్త సినిమా భోళాశంకర్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమాగా రూపొందుతున్న భోళా శంకర్ సినిమాను దర్శకుడు మెహెర్ రమేశ్ అన్ని ఎలిమెంట్​తో తెరకెక్కిస్తున్నారు. హీరోలను తెరపై స్టైలిష్‌గా చూపించడంలో స్పెషలిస్ట్‌ అయిన మెహెర్‌‌.. మరోసారి తన మార్క్​తో భోళాశంకర్‌‌ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లను చూస్తే తెలుస్తోంది. అన్నా చెళ్లెళ్ల సెంటిమెంట్​తో రూపొందుతున్న భోళాశంకర్‌‌ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాలం’కు తెలుగు రీమేక్‌. ఈ సినిమాలో చిరుకు చెల్లిలుగా యంగ్ అండ్ టాలెంటెండ్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. అలాగే చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. అయితే ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ చిరు అభిమానులకు అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చింది. భోళాశంకర్‌‌ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

ఆగస్టు 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేసింది. ఓ సరికొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. చిరంజీవి, కీర్తి సురేష్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కలర్​ఫుల్​గా కనిపించారు. ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌ తో పాటు సినీ ప్రేమికుల్లో జోష్ పెరిగింది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కావాలని అడుగుతున్నారు అభిమానులు. పోస్టర్​కు లైక్స్ కొడుతూ.. ‘పోస్టర్ అదిరింది’ అంటూ కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ కమర్షియల్స్‌ తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్స్​ అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. రావు రమేష్‌, రఘుబాబు, రవిశంకర్‌, మురళీశర్మ, తులసి, వెన్నెల కిషోర్‌, శ్రీముఖి, ప్రగతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మహతి స్వరసాగర్‌ సంగీతం అందిస్తున్న భోళాశంకర్‌‌ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పోయినేడాది గాడ్‌ఫాదర్ సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్‌ కొట్టిన చిరు.. భోళాశంకర్‌‌ సినిమాతో హ్యాట్రిక్‌ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్​లుక్​కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అన్నాచెళ్లెళ్ల సెంటిమెంట్​తో హిట్లర్​ సినిమా తీసి మంచి విజయం అందుకున్నారు చిరంజీవి. మరి ఈసారి ఆ సెంటిమెంట్​ ఎలా వర్కౌట్​ అవుతుందో చూడాలి మరి.