Spiritual: గ‌రిక‌కి ఎందుకు అంత ప్రాముఖ్య‌త‌?

Spiritual: వినాయ‌క చ‌వితి స‌మ‌యంలో గ‌ణ‌నాథుడిని ఎక్కువ గ‌రిక‌తో పూజించాల‌ని అని చెప్తుంటారు. గ‌రిక అంటే గ‌డ్డి. అస‌లు ఈ గ‌రిక‌కి మ‌న హిందూ సంప్ర‌దాయంలో ఎందుకు ఇంత ప్రాముఖ్య‌త‌?

గ‌రిక వెనకున్న క‌థేంటి?

పురాణాల ప్ర‌కారం వృత్రాసుర అనే రాక్ష‌సుడు ఉండేవాడు. ఇత‌న్ని చంప‌డం ఏ దేవ‌తామూర్తుల‌కు సాధ్యం అయ్యేది కాదు. ఇంద్రుడి వ‌జ్రాయుధం కూడా వృత్రాసుర‌ను ఏమీ చేయ‌లేక‌పోయింది. అప్పుడు బ్ర‌హ్మ క‌ల‌గ‌జేసుకుని త‌న కూష్మాండంలో వృత్రాసుర‌ను నొక్కిపెట్టి ఇంద్రుడిని మ‌రోసారి వ‌జ్రాయుధాన్ని వాడాల‌ని శాసిస్తాడు. అలా వృత్రాసురుడు ఓడిపోతాడు. ఓట‌మిని త‌ట్టుకోలేక ప్ర‌పంచంలో ఉన్న అన్ని జలాశ‌యాల్లో మునిగి వాటి శ‌క్తిని నాశ‌నం చేయాల‌నుకుంటాడు. అప్పుడు బ్ర‌హ్మ వెంట‌నే వృత్రాసురుడి చెయ్యి ప‌డ‌ని జ‌లాశ‌యాల‌ను గ‌డ్డితో నింపేస్తాడు. అప్పటినుంచి ఈ గ‌డ్డిని గ‌రిక‌లా అన్ని పూజ‌ల్లో వాడాల‌ని.. గ‌రిక‌ను దేనిపై పెట్టినా అది స్వ‌చ్ఛంగా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

అప్ప‌టినుంచి ఈ గ‌రిక‌ను పూజల్లో, హోమాలు చేస్తున్న‌ప్పుడు వేలికి ఉంగ‌రంలా క‌ట్టుకుని వాడుతున్నారు. వేలికి గ‌రిక‌ను ఉంగ‌రంలా చుట్టి పెట్టుకుంటే దుష్ట‌శ‌క్తులు ద‌రిచేర‌వ‌ని పురాణాలు చెప్తున్నాయి. త‌ర్ప‌ణం స‌మ‌యంలో కూడా అధికంగా గ‌రిక‌ను వాడ‌తారు. ఈ గ‌రిక వ‌ల్ల చ‌నిపోయిన వారి ఆత్మ‌లు శాంతిస్తాయ‌ట‌. ఇక గ్ర‌హ‌ణ స‌మ‌యాల్లోనూ ఇంట్లోని ఆహార ప‌దార్థాల‌పై మంచి నీళ్ల బిందెల‌పై గ‌రిక‌ను ఉంచుతారు. దీని వ‌ల్ల గ్ర‌హ‌ణ ప్ర‌భావం వాటిపై ప‌డ‌దు.