Spiritual: ఈ నరసింహస్వామి నాభి నుంచి రక్తం కారుతుందట!
Spiritual: భారతదేశంలో ఎన్నో నరసింహ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. అయితే ఈ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహంలోని నాభి నుంచి మాత్రం రక్తం కారుతూ ఉంటుందట. ఈ స్వామివారి విశేషాలేంటో తెలుసుకుందాం.
ఈ ఆలయాన్ని హేమాచల లక్ష్మీనరసింహ స్వామి (hemachala lakshmi narasimha swamy) ఆలయం అని పిలుస్తారు. ఇది వరంగల్ జిల్లాలోని మల్లూరులో ఉంది. 4000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఆలయం ఇది. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంది. స్వామి వారిని దర్శించుకోవాలంటే 150 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆలయం చుట్టూ పచ్చదనంతో ఎంతో ప్రశాంతత ఉంటుంది.
ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనది. సాధారణంగా విగ్రహాలు లోహాలతో రాళ్లతో తయారుచేస్తుంటారు. మరికొన్ని స్వయంభుగా వెలుస్తాయి. అయితే ఈ స్వామివారి విగ్రహం మెత్తగా ఉంటుందట. విగ్రహాన్ని చేతులతో నలిపి చూస్తే ఒత్తుకుపోయినట్లు కనిపిస్తుందట. అంతేకాదు పిన్నులతో గుచ్చి చూస్తే రక్తం కారుతుందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఆ రక్తాన్ని ఆపేందుకు స్వామివారి విగ్రహానికి గంధం పూస్తుంటారు.